వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం..
భూపాలపల్లి అర్బన్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక కిట్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటిరోజునే విద్యార్థుల చేతికి కిట్లు అందేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు మూడు నెలల క్రితమే వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు పాఠశాలకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి.
జిల్లాలోని 394 ప్రభుత్వ పాఠశాలల్లో 16వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వేలాది మంది విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్టులు తదితర సామగ్రిని కిట్ రూపంలో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా కిట్ల సరఫరా పూర్తికాకపోవడంతో విద్యార్థులు పాత బ్యాగులు, పాత యూనిఫాంలతోనే పాఠశాలలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారే. ప్రభుత్వం కిట్లు అందిస్తుందనే నమ్మకంతో చాలామంది తల్లిదండ్రులు కొత్త బ్యాగులు, నోట్‌బుక్స్, బూట్లు కొనుగోలు చేయలేదు. ఇప్పుడు కిట్లు రాకపోవడంతో అవసరమైన వస్తువులను సొంతంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెంచేందుకు ఉచిత కిట్లు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య వంటి అంశాలను ప్రభుత్వం ప్రధానంగా ప్రచారం చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కిట్లు అందకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ప్రతీ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లు అందించేవారు. ఈ ఏడాది నూతన కిట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వం యూనిఫాంపై దృష్టి పెట్టలేదు. దీంతో ఈ ఏడాది యూనిఫాంలు సైతం ఆలస్యంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్పెషల్ కిట్ల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ కిట్లు ఎప్పుడు వస్తాయి? విద్యార్థుల చేతికి ఎప్పుడు చేరతాయి? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే కిట్ల పంపిణీ చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అవసరమైన సామగ్రి అందితేనే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ప్రోత్సాహానికి నిజమైన అర్థం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
1,675
2,087
1,401
1,168
1,642
1,731
1,638
1,991
1,678
1,979
1వ
తరగతి
5
4
10
9
8
7
6
3
2
జిల్లాలో పాఠశాలల సంఖ్య
ప్రాథమిక 281
ప్రాథమికోన్నత 43
ఉన్నత 70
ఎల్లుండి నుంచి పాఠశాలలు ప్రారంభం
పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు
విద్యార్థులకు అందించే స్పెషల్ కిట్ల గురించి ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే విద్యార్థులకు అందిస్తాం. విద్యార్థుల సంఖ్య వివరాలను ప్రభుత్వం తీసుకుంది. విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు మండల కేంద్రాలు, పాఠశాలలకు పంపించాం.
– రాజేందర్,
ఇన్‌చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి


