మహాముత్తారం: రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అధికారులను ఆదేశించారు. గురువారం మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భుభారతి పెండింగ్ దరఖాస్తులతో పాటు సాదాబైనామా, ఎలక్షన్ వర్కపెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశ్కరించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
వాహనాల తనిఖీ
మహాముత్తారం: మండలంలోని యామన్‌పల్లి ప్రధాన రహదారి వద్ద మహాముత్తారం ఎస్సై రమేష్ గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనపత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
రేగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని భాగిర్థిపేట క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భాగిర్థిపేట క్రాస్ వద్ద పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారిపై పరకాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తేజావత్ రజిత, భూక్య లక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను అంబులెన్స్‌లో పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
డీఎస్‌బీ ఎస్సై బదిలీ
గోదావరిఖని: కాళేశ్వరం జోన్‌పరిధిలోని ములుగు జిల్లా డీఎస్‌బీ ఎస్‌ఐగా పనిచేస్తున్న యు.ఉపేందర్‌రావును సీసీఎస్ రామగుండానికి బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.
నేరాల నియంత్రణలో
రాజీపడొద్దు
ములుగు రూరల్: నేరాల నియంత్రణలో రాజీపడొద్దని ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు గురువారం ములుగు జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నేలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా వాహనాల తనిఖీ చేపట్టి గంజాయి రవాణాను అడ్డుకోవాలన్నారు. యువత గంజాయి వినియోగానికి అలవాటుపడుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు. పోలీస్‌స్టేషన్లలో పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని వెల్లడించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనన్ భట్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, డీసీఆర్‌బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, సీఐలు పాల్గొన్నారు.


