తొలకరికే.. తొందరొద్దు | - | Sakshi
Sakshi News home page

తొలకరికే.. తొందరొద్దు

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

తొలివాన తర్వాత విరామం..

భూపాలపల్లి రూరల్‌: వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం జిల్లాపై పడుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నీఓతో రుతుపవనాలు గతితప్పే అవకాశం ఉండటంతో రైతులు సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకుంటే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు.

2.16 లక్షల ఎకరాల్లో..

జిల్లాలో వానాకాలం సాగు అంచనా.. జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల మంది రైతులు ఉండగా.. వానాకాలంలో 2.16 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో వరి 1,09,854 ఎకరాలు, పత్తి 1,06,560, కంది 110, పెసర 90, బొబ్బెర 120 ఎకరాలు అదనంగా ఉద్యాన పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు.

ఎల్‌నినో ప్రభావం..

ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు మధ్యలో ఎల్‌నినో ముప్పు ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే నెలలో ఓ మోస్తరు, జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై ఇటీవల అవగాహన కల్పించింది. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు బృందాలుగా పర్యటించారు. ఎల్‌నినో పరిస్థితులను వివరించి పంటల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు

పంటల మార్పిడి అవసరం అంటున్న శాస్త్రవేత్తలు

జిల్లాలో రైతులు ఎక్కువగా వరి, పత్తి, మిర్చి పంటలు పండిస్తున్నారు. వీటికి ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడటంతో వాటి అవశేశాలు భూమిలోపల ఉండి భూమిలో సారాన్ని లేకుండా చేస్తుంటాయి. దీంతో పంటలకు చీడపీడల బెడద ఎక్కువవుతుంది. రైతులు పంటల మార్పిడి చేస్తే భూమిలో సారం పెరిగి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

వర్షాలకు ఎల్‌నినో ముప్పు

రుతుపవనాలు గతి తప్పే అవకాశం

సాగులో మార్పులు అవసరమంటున్న వ్యవసాయ అధికారులు

వానాకాలంలో తొలకరి జల్లులు కురవగానే విత్తనాలు వేయడం రైతులకు ఆలవాటు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పుడు తొలివాన అనంతరం పెద్ద విరామం రావొచ్చు. నేల కనీసం 3 నుంచి 5 అంగుళాలు తడిస్తేనే విత్తనం వేయాలి. లేదంటే మొలకలు ఎండిపోయి పెట్టుబడులు వృథా అవుతాయి. నీటి నిల్వలు తక్కువగా ఉండొచ్చు. ఈసారి వరి తదితరాల పంటలకంటే తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement