భూపాలపల్లి అర్బన్: పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజన పథకం) కింద విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనం అందించే లక్ష్యంతో జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించారు. కమ్యూనిటీ మొబైలైజింగ్ అధికారి సామల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు పోషకాహారం అందించడం ద్వారా హాజరు శాతం పెరగడంతో పాటు డ్రాప్‌అవుట్లు తగ్గుతాయని, విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించగలరన్నారు. శిక్షణలో రిసోర్స్ పర్సన్లు మధ్యాహ్న భోజనం తయారీ విధానాలు, పరిశుభ్రత ప్రమాణాలు, రాగి మాల్ట్ తయారీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాల్గొన్న వారితో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేయించి ప్రాయోగిక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, రాజ గోపాల్, కుసుమ కృష్ణమోహన్, చల్ల కిషన్‌రెడ్డి, షిరీ న్, శశికళ, శారద, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


