భూపాలపల్లి అర్బన్: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మధుసూదన్ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఎవరైనా స్కానింగ్ కేంద్రాల్లో ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కచ్చితంగా సూచనలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓ డాక్టర్ శ్రీదేవి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ దేవేందర్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సంధ్య, ఎన్‌జీఓ ప్రతినిధి శ్యాంప్రసాద్, డెమో శ్రీదేవి పాల్గొన్నారు.


