భూపాలపల్లి అర్బన్: 56వ వార్షిక సేఫ్టీ ఫోర్ట్‌నైట్ కార్యక్రమాలు బుధవారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇంటర్ ఏరియా ఫస్ట్ ఎయిడ్ పోటీలు నిర్వహించారు. గని మేనేజర్ అనుగ్రహ నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రక్షణ జీఎం సాయిబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కార్మికుల భద్రతకు సంస్థ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గనుల్లో పనిచేసే ప్రతీ కార్మికుడు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ పరిజ్ఞానం ప్రాణాలను కాపాడగలదన్నారు. ఫస్ట్ ఎయిడ్ పోటీల్లో వివిధ ఏరియాల బృందాలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాయి. ఈ పోటీల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సాయిప్రసాద్, డాక్టర్ ఉదయ్‌కుమార్, మధుబాబు, తిరుపతి, రవీందర్, కార్మిక సంఘాల ప్రతినిధులు, సూపర్‌వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
రేపు ఉచిత ఆయుష్ వైద్యశిబిరం
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 10న ఉచిత ఆయుష్ మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ వైద్యులు డాక్టర్ తనూజా రాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు ఇల్లందు క్లబ్‌లో ఉచిత యోగా శిబిరం నిర్వహించబడుతుందన్నారు. అనంతరం ఉదయం 9:30 గంటల నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డీఈఐసీ భవనంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని, ఈ శిబిరంలో ఆర్థరైటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, చర్మవ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్యులు ఉచితంగా చికిత్స అందించనున్నారని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


