భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రైతులకు చెల్లించాల్సిన సన్నధాన్యం బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపెళ్లి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మహదేవపూర్, కాటారం, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాలకు చెందిన రైతులకు సన్నవడ్ల బోనస్ బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుమారు 2,700 మంది రైతులకు రూ.6.56 కోట్ల బోనస్ రావాల్సి ఉందన్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని బ్యాంకులతో సమన్వయం చేసి బోనస్ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, జిల్లా నాయకులు క్యాతరాజు సతీష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


