భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా పదవ తరగతి జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 3,544మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఆరుగురు గైర్హాజరైనట్లు వెల్లడించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
ములుగు: యువత పొగాకు, గుట్కాలు, సిగరెట్లు, మద్యం తదితర మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ సూచించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రతిరోజూ గంట పాటు వ్యాయామం చేయాలన్నారు. అలాగే ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్‌న్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, సివిల్ సర్జన్ నరేశ్, డాక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్ తాడ్వాయి : ఏజెన్సీలోని వడ్డీ వ్యాపారులు అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ గిరిజనులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని, వారి ఆగడాలను వెంటనే ప్రభుత్వం అరికట్టాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్‌కుమార్, జాతీయ అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని లింగాలలో తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం మంగళవారం స్థానిక ఆదివాసీ రైతులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. పంట రుణాల పేరిట ఒక్కొక్క కుటుంబానికి రూ. 30 లక్షలు అప్పుగా చూపిస్తూ పలువురి నుంచి భూములను ఆక్రమించుకోవడంతో పాటు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. 1960 వ్యాపారాల చట్టం ప్రకారం ఇది రాజ్యాంగం విరుద్దమని పేర్కొన్నారు. ఇలా అక్రమ వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామంలో సైతం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు, స్థానిక ఆదివాసీ రైతులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి నియమితులయ్యారు. మంగళవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు గణిత విభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్ధానంలో వెంకట్రాంరెడ్డిని ఏడాది పాటు బాధ్యతలు నిర్వర్తించేందుకు నియమించారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులను వెంకట్రాంరెడ్డికి అందజేశారు. ప్రస్తుతం ఆయన టీజీఎడ్‌సెట్–2026 కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
కేయూ క్యాంపస్: ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం మంగళవారం కాకతీయ యూనివర్సిటీని సందర్శించింది. ఆ అసోసియేషన్ చీఫ్ కన్వీనర్ డాక్టర్ అనిల్‌కుమార్ ఠాకూర్, జాయింట్ సెక్రటరీ నారాయణన్, సౌత్ కో–ఆర్డినేటర్ దిలీప్ కుమార్ కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈఏడాది డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో యూనివర్సిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశం నిర్వహించే అవకాశాలు, వసతులు ఇతర ఏర్పాట్లను పరిశీలించేందుకు బృంద సభ్యులు కేయూను సందర్శించారు. ఈసందర్భంగా కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందించారు.


