టేకుమట్ల: ఆశవర్కర్ల సేవలు అమూల్యమైనవని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం మండలంలోని వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులు, హాజరు పట్టిక, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఏ ప్రాంతం నుంచి రోగులు వస్తున్నారు, ఏ ఆరోగ్య సమస్యతో ఎక్కువ మంది వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రతి రోజు సుమారు 70 మందికి తగ్గకుండా ఓపీ చూడాలన్నారు. బాల్యంలో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలను అందిండంతో పాటు, ప్రసవాలను పెంచాలని సూచించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించి ఆరోగ్య సమాజానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హారిక, నాగరాణి, తహసీల్దార్ స్వరూపరాణి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్, సర్పంచ్ బొడ్డు తిరుపతి ఉన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


