భూపాలపల్లి: సన్నవడ్లను విక్రయించి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్ చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ జిల్లాలోని మల్హర్, కాటారం మండలాలకు చెందిన 50మంది రైతులు సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం సూచించిన మేరకు సన్నవడ్లను సాగు చేశామని, క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ స్పందించి.. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో బోనస్ జమఅయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు కౌటం రవీందర్, రైతులు పాల్గొన్నారు.


