పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వరంగల్ ఎంపీ కావ్య
● జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం
భూపాలపల్లి/మొగుళ్ళపల్లి: పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మొగుళ్లపల్లి మండలం పాత ఇస్సిపేటలో రూ. 13.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మార్కెట్ గోదాం నిర్మాణానికి శనివారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో ఇందుర్తి ఓంకార్‌కు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ వద్ద మూడు కూడళ్ల అభివృద్ధి, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. తదుపరి భారత్ ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు దక్కలేదని, తమ ప్రభుత్వం మొదటి దఫాలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని, మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామన్నారు. సన్నబియ్యం పథకానికి రూ.13వేల కోట్లు, సన్నధాన్యం బోనస్ కింద రూ.3వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. భూపాలపల్లికి రైల్వేలైన్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నానని తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం, టూరిజం హబ్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడానని, బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూపాలపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేయించానని, డీపీఆర్ దశలో ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రూ.200 కోట్లు మంజూరు చేయించానన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


