
వరదలపై అప్రమత్తంగా ఉన్నాం
భూపాలపల్లి: వర్షాకాలం నేపథ్యంలో వరదలపై అప్రమత్తంగా ఉండి, తగు ముందస్తు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, సలహాలు అందించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వెంట ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా అధికారులు ఉన్నారు.
దరఖాస్తులు పరిష్కరించాలి..
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 70మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కోసం ఇచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత శాఖాధికారులు జాగ్రత్తగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తుకు సమాధానం ఇవ్వడం, అవసరమైన సమాచారం ప్రజలకు అందించడం, సమస్య పరిష్కారం దిశగా స్పష్టమైన రిపోర్టులు సమర్పించడం అధికారుల బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఈఈ బసవప్రసాద్..
భూపాలపల్లి ఇరిగేషన్ డివిజన్–1 డీఈగా విధులు నిర్వర్తిస్తున్న బసవప్రసాద్‌కు ఈఈగా పదోన్నతి లభించగా సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. విజయవంతంగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ