
జిల్లాలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
జిల్లాలో నమోదైన కేసులు
భూపాలపల్లి అర్బన్: 20 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దోమలు వ్యాప్తి చెంది జిల్లాలో డెంగీ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోజురోజుకూ ఓపీ తాకిడి పెరుగుతోంది. ప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు వస్తున్నారు. జిల్లాలో 8 నెలల్లో 42 డెంగీ, 9 మలేరియా కేసులు నమోదుకాగా.. మహాముత్తారం మండలంలో అత్యధికంగా డెంగీ, మలేరియా కేసులు నమోదయ్యాయి.
కొనసాగుతున్న ఫీవర్ సర్వే
జిల్లాలో గత నెల చివరి వారంలో నిర్వహించిన సర్వేలో 12 మండలాల్లో 821 మందికి జ్వరం, దగ్గు, జలుబు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానిత 500 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు సైతం నిర్వహించారు. వారిలో నుంచి నాలుగు డెంగీ, ఒక మలేరియా పాజిటివ్ వచ్చాయి.
యుద్ధప్రాతిపదికన చర్యలు..
జిల్లాలోని 241 గ్రామపంచాయతీల్లో దోమల నివారణ, వ్యాధులు ప్రబలితే సత్వరమే స్పందించి బాధితులకు తగిన చికిత్సను అందించేలా వైద్యారోగ్య శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా గ్రామ కార్యదర్శి, ఆశకార్యకర్తలను, స్థానిక వైద్యాధికారి, అంగన్‌వాడీ కార్యకర్త, సబ్ సెంటర్ల పరిధిలోని ఇద్దరు చొప్పున ఏఎన్‌ఎంలను ఆరోగ్య కార్యకర్తలు, పీహెచ్‌సీల స్థాయిలో సూపరైజర్లను అప్రమత్తం చేశారు. కేసులు నమోదు మేరకు పరిసర ప్రాంతాల్లో ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలను నిర్వహించేలా సిద్ధం చేశారు.
వర్షాకాలం వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కల్పిస్తున్నాం. వివిధ రకాల దోమలు, కీటకాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. దోమలు పుట్టకుండా.. కుట్టకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండేందుకు అవకాశం లేకుండా చూసుకోవాలి.
– డాక్టర్ మధుసూదన్, డీఎంహెచ్‌ఓ
సంవత్సరం డెంగీ మలేరియా
2019 27 18
2020 07 56
2021 11 58
2022 19 24
2023 85 03
2024 60 12
2025 (ప్రస్తుతం) 42 09
8 నెలల్లో 42 డెంగీ,
9 మలేరియా కేసులు
ఇంటింటా కొనసాగుతున్న ఫీవర్ సర్వే
జిల్లా వ్యాప్తంగా
821 మంది జ్వర పీడితులు