
సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం
● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
మల్హర్: రైతులకు సౌకర్యాలు, గౌరవం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మండలంలోని తాడిచర్ల గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో అధునీకరణ చేసిన సహకార సంఘ కార్యాలయం, గోదాం భవనం, రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనం రూ.7.80 లక్షలతో ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి రైతు వేదిక వరకు నిర్మించనున్న సీసీ రోడ్డును, రూ.3.5 లక్షలతో పీఏసీఎస్ ఆర్చిగేట్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. రూ.12 లక్షలతో వ్యయంతో నిర్మించనున్న తహసీల్దార్ కంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సహకార సంఘం కార్యాలయం ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంత రైతులకు బ్యాంకు సేవలు, వ్యవసాయ రుణాల మంజూరు సులభతరం అవుతుందన్నారు. తాడిచర్ల జూనియర్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ప్రధానంగా బాలికలు పట్టణాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడం అభినందనీయమన్నారు. అధునాతన హంగులతో గ్రంథాలయం ఏర్పాటు ద్వారా విద్యార్థులకు, ప్రజలకు పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ వనరులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పెద్ద తాడిచర్ల డేంజర్ జోన్ (ఇండ్ల సేకరణ) సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప మొండయ్య, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబూరావు, మహాదేవపూర్ ఏడీఏ శ్రీవ్యాల్, తహసీల్దార్ రవి పాల్గొన్నారు.