
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు కొత్తూరి రాజిరెడ్డి (90) గురువారం మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన వైకుంఠధామం గ్రామ శివారులోని చలివాగు పక్కన ఉంది. కానీ, పొలాల వెంబడి దారంతా బురద, గుంతలమయం కావడంతో శుక్రవారం అంత్యక్రియల నిర్వహణకు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో మృతుని బంధువులు కొద్దిదూరం వెళ్లి ఆగిపోయారు. ‘ఆ నలుగురు’మాత్రమే అష్ట కష్టాలు పడి శవాన్ని వైకుంఠధామానికి చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. వైకుంఠధామాలకు రోడ్డు సక్రమంగా వేయించలేని పాలకులు.. పల్లెలను ఎలా అభివృద్ధి చేస్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్తిని పంచుకుని అమ్మను గెంటేశారు
మద్దూరు: ఆస్తి మొత్తం లాక్కొని.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఇంటి నుంచి గెంటేశారు కుమారులు. దీంతో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఆ తల్లి.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన మద్దూరు మండలం ఖాజీపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్ గ్రామానికి చెందిన 83 ఏళ్ల నాగమ్మ, వడ్ల రాములు భార్యాభర్తలు. వీరికి భీములు, వెంకటయ్య, చంద్రమౌళి, ఒక కూతురు లక్ష్మమ్మ ఉన్నారు. భర్త వడ్ల రాములు ఐదేళ్ల క్రితం మృతిచెందాడు.
దీంతో ఆయన పేరుమీద ఉన్న 14 ఎకరాల భూమితో పాటు, రూ.4 లక్షల నగదును గ్రామ పెద్దల సమక్షంలో పంపకాలు చేపట్టారు. నాగమ్మకు రూ.40 వేలు అందజేసి భూమి, మిగిలిన డబ్బులను కుమారులకు పంచారు. అయితే తల్లి నాగమ్మను ముగ్గురు కుమారులు ఏడాదికి ఒకరు చొప్పున చూసుకోవాలని పెద్దలు చెప్పినా, భూములు, డబ్బులు చేతికందడంతో నాగమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు కుమారులు. దీంంతో నాగమ్మ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో కుమారులను ఆశ్రయించగా, తల్లిపై జాలి లేకుండా నానా మాటలు తిట్టి పంపించారు. దీంతో తనకు న్యాయం చేయాలని, భర్త ఆస్తి తనకు దక్కేలా చూడాలని ఆ తల్లి తహïసీల్దార్ మహేశ్‌గౌడ్‌ను ఆశ్రయించింది.