మల్హర్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, వైద్య సేవల పని తీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందుల స్టాక్, శానిటేషన్ పరిస్థితులు, రికార్డుల నిర్వహణ, ఓపీ రిజిస్టర్ తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ