
విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
కాటారం: వర్షాకాలంలో డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలు, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. కాటారం మండలం జాదారావుపేట, చిద్నెపల్లి గ్రామపంచాయతీల్లో రెండు డెంగీ కేసులు నమోదు కావడంతో బుధవారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బాధిత ఇళ్లను సందర్శించారు. డెంగీతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స పొందుతున్న తీరు, ప్రభుత్వ వైద్య సిబ్బంది ద్వారా అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించి సరైన వైద్య పరీక్షలు చేయాలని వైద్యులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని.. నిత్యం వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని పంచాయతీ అధికారులకు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి, ఎంపీఓ వీరస్వామి, మండల వైద్యాధికారిణి మౌనిక, గ్రామపంచాయతీ, వైద్య సిబ్బంది ఉన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి