సరిహద్దు భూ సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సరిహద్దు భూ సమస్యలను పరిష్కరించాలి

Aug 2 2025 6:34 AM | Updated on Aug 2 2025 6:34 AM

సరిహద్దు భూ సమస్యలను పరిష్కరించాలి

సరిహద్దు భూ సమస్యలను పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో రెవెన్యూ, అటవీ సరిహద్దు భూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌హాల్‌లో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలెక్టర్‌ సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కాటారం, మల్హర్‌, మహాముత్తారం, మహదేవపూర్‌ మండలాలలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాలు ఉన్నట్లు తెలిపారు. అటవీ, రెవెన్యూ భూముల సమస్యల పరిష్కారానికి సంయుక్త సర్వే నిర్వహించి హద్దులు కేటాయించాలన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరువురు శాఖల అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, కాటారం సబ్‌కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, ఎఫ్‌డీఓ సందీప్‌రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

పనులను వేగవంతం చేయాలి..

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ పరికరం ఏర్పాటు పనులను కలెక్టర్‌ రాహుల్‌శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలకు సమయానుకూలంగా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సీటీ స్కాన్‌ పరికరం ఏర్పాటును త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టంచేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా, సంబంధిత ఇంజినీరింగ్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీటీ స్కాన్‌ యంత్రం ఏర్పాటుతో ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీన్‌కుమార్‌, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

68వేల మందికి సబ్సిడీ గ్యాస్‌

జిల్లాలో గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కి అందిస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,36,243 లక్షల గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసి రూ.655.19 లక్షల సబ్సిడీ మంజూరు చేసినట్లు చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

గణపురం: మండలంలోని బుర్రకాయల గూడెం గ్రామంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్‌ కార్యాలయంలోని భూ భారతి దరఖాస్తుల స్టోర్‌ రూంను పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. నిర్మాణ పనులలో జాప్యం లేకుండా నాణ్యతతో వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్ధార్‌ను ఆదేశించారు. గొర్రెల వైద్య సేవలకు వచ్చిన రైతు కలెక్టర్‌కు గొర్రె పిల్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, తహసీల్దార్‌ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement