
లాభం ఎంత..?
గత ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటించని సింగరేణి యాజమాన్యం
69.86 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
సింగరేణి సంస్థ గతంలో మారిదిగానే 2024–25 ఆర్థిక సంవత్సరం టర్నోవర్‌ను అధిగమించడంలో వెనుకబడింది. అనుకున్న స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని సాధించలేకపోయింది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కోల్ ఇండియాతో పోటీ పడింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంకాగా.. 64.06 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది.
● నాలుగు నెలలుగా
ఎదురుచుస్తున్న కార్మికులు
● లాభాల వాటా పెంచాలని డిమాండ్
● రూ.35 వేల కోట్లకు పైగా
వ్యాపారం చేసినట్లు అంచనా
భూపాలపల్లి అర్బన్: సింగరేణికి ప్రధాన బలం ఉద్యోగులేనని, విధుల్లో వారి కృషి, పట్టుదలతో సంస్థకు లాభాలు వస్తున్నాయని ప్రతిసారీ యాజమాన్యం చెబుతోంది. అందుకే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని విధంగా లాభాల్లో వాటా చెల్లిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతోంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా నేటికీ కార్మికులకు 2024–25 ఆర్థిక సంవత్సర లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటించలేదు. అయితే సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 59.84 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
కార్మికులకు వాటా..
కోలిండియాలో సంస్థ లాభాలు సాధిస్తే అందులో కార్మికులకు వాటా చెల్లిస్తామని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంస్థ బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వెళ్లిన క్రమంలో సంస్థను లాభాల బాట పట్టించేందుకు అప్పటి గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 1999– 2000 ఆర్థిక సంవత్సరంలో 10 శాతంతో ప్రారంభమైన లాభాల వాటా.. గత ఏడాది 32 శాతానికి చేరుకుంది. సంస్థ చరిత్రలోనే 2018–19లో అత్యధికంగా రూ.1,766 కోట్ల లాభాలు ఆర్జించింది. దీంతో కార్మికుల వాటా 28 శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఏడాది ఒక్కో కార్మికుడికి సగటున రూ.లక్ష వరకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రతీ ఏడాది ఆలస్యమే..!
గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు అవుతున్న ఇప్పటి వరకు కార్మికులకు రావాల్సిన లాభాలను సింగరేణి ప్రకటించలేదు. ప్రతి ఏడాది మాదిరిగానే అడిట్ పూర్తి కాలేదని సింగరేణి యాజమాన్యం సమాధానాలు చెబుతుంది. సింగరేణి సంస్థ లాభాలను ప్రకటించేందుకు ప్రతీ సంవత్సరం నాలుగైదు నెలల సమయం తీసుకుంటుంది. అధునాతన విధానాలను అమలు చేస్తూ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కలు చేస్తున్న క్రమంలో ప్రతీ ఏడాది ఇదే విధంగా ఆలస్యం చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. లాభాలు ప్రకటించి ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటి వరకు యాజమాన్యం ప్రకటించకపోవడంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవ లాభాలను ప్రకటించాలి
సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించాలి. సకాలంలో కార్మికులకు అందిస్తేనే ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఏడాది మాదిరిగా నామాత్రపు లాభాలు ప్రకటించొద్దు. నెలలు గడిస్తే కాని యాజమాన్యం లెక్కలు పూర్తి చేయడం లేదు. ఈసారి సంస్థ సుమారు రూ.4 వేల కోట్లకు పైగా లాభాలు సాధించి ఉంటుంది. లాభాలు ప్రకటించి కార్మికులకు 40 శాతం ప్రకటించాలి.
– కంపేటి రాజయ్య,
సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి
సింగరేణి లాభాలు, కార్మికులకు పంపిణీ చేసిన శాతం
సంవత్సరం లాభాలు పంపిణీ శాతం
(రూ.కోట్లలో)
2017–18 1,200 27
2018–19 1,766 28
2019–20 993 28
2020–21 273 29
2021–22 1,227 30
2022–23 2,222 32
2023–24 2388 33

లాభం ఎంత..?