
యూరియా కొరత రానివ్వొద్దు
భూపాలపల్లి: యూరియా కొరత లేకుండా రైతులకు సరిపడా సరఫరా చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశపు హాల్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి యూరియా లభ్యతపై వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులు, సహకార సంఘాల చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు యూరియా పంపిణీలో అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకం లేని రైతులకు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని యూరియా ఇవ్వాలని చెప్పారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే దుకాణాల లైసెన్సులు రద్దుచేసి పోలీసు కేసులు నమోదు చేయించాలన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఈఓలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, సహకార అధికారి వాలియానాయక్, మార్క్‌ఫెడ్ అధికారి శ్యామ్, సహకార సంఘాల సీఈఓలు పాల్గొన్నారు.
మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పట్టణంలోని 20, 21వ వార్డుల పరిధిలోని హనుమాన్‌నగర్, శాంతినగర్ కాలనీల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాగుల పంచమిని పురస్కరించుకొని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. తరువాత క్యాంపు కార్యాలయానికి చేరుకొని కొత్తపల్లిగోరి మండలం బాలయ్యపల్లి గ్రామంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు