
ఆపుకోవాల్సిందే..
మరుగుదొడ్లు లేక ‘కాళేశ్వరం’లో ఇబ్బందులు
కాళేశ్వరం: కాళేశ్వరాలయంలో టెండర్ల ద్వారా దుకాణదారుల నుంచి సంవత్సరానికి సుమారు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తున్నా.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రధానంగా మరుగుదొడ్లు లేకపోవడంతో దుకాణదారులు, భక్తులు, అర్చకులు, సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, రెండుకు వెళ్లాలంటే బయట పరిసరాలకు లేదా.. ఇంటికి వెళ్లే దాక ఆపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తప్పదనుకుంటే ఇంటికి వెళ్లి రావాల్సిన పరిస్థితి. ఉత్సవాలు జరిగే సమయంలో జనసమూహం ఎక్కువ ఉండడంతో దుకాణదారులు చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు.
అసంపూర్తిగా
మరుగుదొడ్ల నిర్మాణం..
శ్రీరామాలయం వెనుకభాగంలో దుకాణాల సముదాయాల వెనుకాల దేవాదాయశాఖ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నాగులమ్మ దేవాలయం సమీపంలో నిర్మాణంలో మరో మరగుదొడ్డి కూడా అసంపూర్తిగానే ఉంది. ఈఓ కార్యాలయం వెనుక భాగంలో సులభ్ కాంప్లెక్సు ఉన్నా దుకాణ సముదాయాలకు దూరంగా ఉంది. దీంతో దుకాణాలు వదిలేసి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. భక్తులు వెళ్లడానికి అడ్రస్ అడుగుతూ వెళుతుంటారు. ఎవరికి కూడా అందుబాటులో లేదు. రెండు హోటళ్లు, బేకరి నడిపిస్తున్న దుకాణాల సముదాయంలో మరుగుదొడ్లు ఉన్నా అంతంతమాత్రమే. సముదాయాల చుట్టూరా చెత్తాచెదారం పెరిగి, పాములకు ఆవాసంగా మారింది. గతేడాది బతుకమ్మ సమయంలో ఓ హోటల్ నిర్వాహకుడి కుమార్తెకు హోటల్‌లోనే పాము కాటు వేయడంతో వారం పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది.
16దుకాణాలు..
రూ.కోటి ఆదాయం..
కాళేశ్వరాలయం లోపల, బయట కలిపి మొత్తంగా 16 దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీటికి టెండర్ల ద్వారా దేవాదాయ శాఖ అధికారులకు ప్రతి సంవత్సరం రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. దుకాణదారుల్లో పురుషులు, మహిళలు ఉన్నారు. టెండర్ల ద్వారా ఆదాయం పొందుతున్న అధికారులు దుకాణదారులకు కనీస సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ప్రధానంగా మరుగుదొడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణదారులే కాదు.. ఆలయానికి వచ్చే భక్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది సైతం మరుగుదొడ్లు లేక ఒకటి, రెండు వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బందికి కూడా మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉంది. వీరు సైతం సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అందరికీ ఉపయోగం
దేవస్థానం అర్చక, సిబ్బంది, దుకాణ నిర్వాహకులు, భక్తులకు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువస్తాం. గతంలో వచ్చిన రూ.25కోట్ల నిధుల నుంచి మిగిలిన నిధులతో రెండు చోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. కొన్ని రోజులుగా పనులు నిలిచాయి. మళ్లీ ప్రారంభించాం. త్వరలో మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకువస్తాం. ఎవరికీ ఇబ్బంది కలగనివ్వం. – శనిగల మహేష్, ఈఓ, కాళేశ్వరం దేవస్థానం
●
రేపు దుకాణాలను టెండర్లు..
కాళేశ్వరాలయంలో ఈనెల 30న 11 దుకాణాలకు రెండు సంవత్సరాల కాల వ్యవధితో టెండర్ కమ్ బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. ఇంతకుముందు ఏడాదికి ఒకసారి నిర్వహించేవారు ప్రస్తుతం రెండు సంవత్సరాలకు నిర్వహిస్తున్నారు. టెండర్లలో 1.బొమ్మలు, గాజులు విక్రయించడం, 2. టెంకాయలు, పూజాసామగ్రి విక్రయించుట, 3. బొమ్మలు, గాజులు విక్రయించుట, 4. స్వీట్‌హౌస్, 5 పూలు, పూలదండలు విక్రయించుట, 6. కొబ్బరి ముక్కలు పోగుచేసుకునుట, 7. అమ్మవార్ల చీరలు, శేషవస్త్రములు పోగుచేయుట 8, పాదరక్షలు, బ్యాగులు, లగేజీ భద్రపరుచుట, 9, సులభ్ కాంప్లెక్సు నడుపుకునే హక్కు, 10 ఫొటోలు, చరిత్ర పుస్తకాలు విక్రయించుట, 11. భక్తులను ఫొటోలు తీసుకొనే హక్కు కోసం సీల్డు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించున్నారు. రెండు హోటళ్లు, బేకరికి మరోసారి టెండర్ జరుగనున్నట్లు తెలిసింది.
దుకాణదారులు, భక్తులు, అర్చకులకూ..
ఒకటి, రెండుకు బయట పరిసరాలు లేదా ఇంటికి వెళ్లాల్సిందే..
ఉత్సవాలు జరిగే సమయాల్లో
చెప్పుకోలేని బాధ
దృష్టిసారించని దేవాదాయశాఖ అధికారులు

ఆపుకోవాల్సిందే..