సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర

Jul 28 2025 8:15 AM | Updated on Jul 28 2025 8:15 AM

సింగర

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర

భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్‌/మొగుళ్లపల్లి: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన గురుకులాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ఆరోపించారు. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో మాజీ సర్పంచ్‌ కొడారి కొమురయ్య విగ్రహాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించి రైతు కూలీలతో మాట్లాడారు. అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రం, జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతీ గురుకులాన్ని సందర్శించి అక్కడి సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని, వచ్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ను గెలిపించాలని కార్మికులను కోరారు. కాంగ్రెస్‌ ఆగడాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. త్వరలోనే జిల్లాకో పార్టీ లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో 3,400 పల్లెలను జీపీలుగా, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేసినవాటిని చెప్పుకోవడంలో విఫలం అయినందునే ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్నారు. మరోమారు అలా జరుగకుండా కాంగ్రెస్‌ చేస్తున్న మోసాలను ఇంటింటికీ తెలుపాలని సూచించారు.

గండ్రకే ఎమ్మెల్యే టికెట్‌...

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు సోదరుడిగా ఉన్న సిరికొండ మధుసూదనాచారికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసన సభాపతి పదవి ఇచ్చారన్నారు. అంతేకాకుండా కేబినెట్‌ హోదాకు సమానమైన శాసన మండలి ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చూసుకుంటారని, ఆయనకే టికెట్‌ అని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. గండ్ర నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై పోలీ సులు అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. గోరీల మీద మాదిరిగా ఇక్కడి ఎమ్మెల్యే శిలాఫలకాలపై ఫొటోలు వేయించుకుంటున్నాడని అన్నారు. తాను భూకబ్జా చేశానని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, నాయకులు కటకం జనార్దన్‌, గొర్రె సాగర్‌ పాల్గొన్నారు.

గురుకులాలను గాలికొదిలిన ప్రభుత్వం

జిల్లాకో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తాం.. కేసులకు జంకొద్దు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

కే తారకరామారావు

భూపాలపల్లి, ఇస్సిపేట, మొగుళ్లపల్లిలో

పర్యటన

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర1
1/1

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement