
వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భౌతిక, రసాయన శాస్త్రంలో ప్రతిభ చాటుతున్నారు. భౌతికశాస్త్రంలో దశావధానం, రసాయనశాస్త్రంలో 12మంది విద్యార్థులు 118 మూలకాలను 15 సెకన్ల కాల వ్యవధిలో, అంతకు తక్కువ సమయంలోనే చెప్పడం అబ్బుర పరుస్తుంది. ఈ రెండు అంశాలను ఇటీవల ఫిజికల్‌సైన్స్ ఉపాధ్యాయుడు దొనికల రాజేందర్ ‘వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు వీడియోలు, ఫొటోలు పంపించారు. ఆ సంస్థ విద్యార్థుల ప్రతిభను చూసి ఎంపిక చేశారు. దీంతో మంగళవారం ఈ అవార్డుల ప్రదానాన్ని కలెక్టర్ రాహుల్‌శర్మ చేతులమీదుగా కాళేశ్వరం పాఠశాల ఆవరణలో అందజేయనున్నారని పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం దొనికల రాజేందర్ ఆదివారం తెలిపారు.
అధికారుల సూచనలు పాటించాలి
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని రైతులు అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి బాబురావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాలతో మురుగునీరు పొలాల్లో, పత్తి చేలల్లో నిలిస్తే వెంటనే తీసేయాలన్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, చెరువులు, కుంటలకు రైతులు దూరంగా ఉండాలని సూచించారు.
హైపవర్ వేతనాలు
చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని బీఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజేందర్ కోరారు. భూపాలపల్లి ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం బీఎంఎస్ డిమాండ్ల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణిలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, కనీసం 50శాతం ఉత్పత్తి వారితోనే చేయించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ వేతనాలతో పాటు సీఎంపీఎఫ్ ఖాతాలు, వైద్య, క్వాటర్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. సీఎంపీఎఫ్ వ్యవస్థను పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలన్నారు. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, పెర్క్స్‌పై ఐటీ రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్, రఘుపతిరెడ్డి, మొగిలి, రాజు, రాజన్న, సాగర్ పాల్గొన్నారు.
రూ.3లక్షల ఆర్థిక సాయం
రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని నిజాంపల్లి గ్రామానికి చెందిన రాయినేని రాజు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. దీంతో 2000–01 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి మిత్రులు ఆదివారం మిత్రుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు కొండ్రా నరేష్, లక్ష్మారెడ్డి, వక్కల వెంకటేష్, లక్ష్మణ్‌రావు, రాకేష్, కిషోర్, రాంబాబు, గోపి, రమేష్ పాల్గొన్నారు.
ఎరుకలకు ప్రాధాన్యం
కల్పించాలి
కాటారం: రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీ ఎరుకలకు ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. కాటారం మండలకేంద్రంలో ఆదివారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఆదివాసీ ఎరుకల ప్రజలు విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి పోయారన్నారు. సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ రిజర్వేషన్లలో ఎరుకల కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుతాటి రవికుమార్, కోశాధికారి వనం రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్యాల రాము పాల్గొన్నారు.

వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపిక

వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపిక