
టీబీ నిర్మూలనకు వైద్యుల సహకారం అవసరం
భూపాలపల్లి: జిల్లాలో టీబీ వ్యాధిని నిర్మూలించడంలో ప్రైవేట్ వైద్యుల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్, సింగరేణి ఆస్పత్రుల వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థతోపాటు ప్రైవేట్ వైద్యుల భాగస్వామ్యం అవసరమన్నారు. జిల్లాలో 95 వేల మందికి టీబీ పరీక్షలు చేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,695 మందికి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. జూన్ 9న జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 100 రోజుల్లో 95 వేల మందికి పరీక్షలు చేయాల్సి ఉందని, ఐదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్స్ రే కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వాటితో నిర్ణీత వ్యవధిలో పరీక్షలు పూర్తి చేయలేకపోతున్నామని, ప్రైవేట్ వైద్యులు, ఎక్స్ రే కేంద్రాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ సోకిన వ్యక్తులను గుర్తించిన వెంటనే సమాచారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అందించాలన్నారు. తద్వారా రోగి నివసించే ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి, మెడికల్ క్యాంపులు నిర్వహించి, వ్యాధి వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీదేవి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్, సింగరేణి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ