
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని 12 మండలాల్లో ఫిజియోథెరపీ వైద్యులు, స్పీచ్ థెరఫిస్టులను తాత్కాలిక పద్ధతిలో నియామకానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగున్నర బీపీటీ కోర్సు పూర్తి చేసి రాష్ట్ర పారా మెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గడువు పొడిగింపు
భూపాలపల్లి అర్బన్: జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చిన్న కాళేశ్వరం కెనాల్ నిర్మించొద్దు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువు గుండా వెళ్తున్న డీ1, డీ2, డీ3 ప్రధాన కెనాల్(కాల్వలు) నిర్మించొద్దని రైతులు సంతకాలు చేసి తీర్మానం చేశారు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కెనాల్ నిర్మించడం వలన ఏర్పడు నష్టాలను ఆయనకు రైతులు వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డితో సమావేశం నిర్వహించి తీర్మానం చేయించాలని ఆదేశించారు. దీంతో మంగళవారం పీఏసీఎస్ చైర్మన్ అధ్యక్షతన మహదేవపూర్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు (డిస్ట్రిబ్యూటరీ కెనాల్) డీ1, డీ2, డీ3 కాల్వలు తమ భూముల గుండా వెళుతుండడంతో పంటనష్టం జరుగుతుందని వాపోయారు. కాల్వల నిర్మాణంతో తమపంటలు పండించడం సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పోత వెంకట్‌స్వామి, శేఖర్, నాయకులు అక్భర్‌ఖాన్, వరప్రసాద్, కటకం అశోక్ పాల్గొన్నారు.
సీజ్ చేసిన ఇసుక వేలం
చిట్యాల: మండలంలోని కాల్వపల్లి గ్రామంలో ఇటీవల ఎనిమిది ప్రాంతాలలో అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపులను సీజ్ చేయగా మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వేలం పాట నిర్వహించారు. వేలంలో ఏడుగురు సభ్యులు పాల్గొనగా.. కాల్వపల్లి గ్రామానికి చెందిన సూర తిరుపతి రూ.5.72 లక్షలకు పాడి కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రాజేందర్, సీనియర్ అసిస్టెంట్ మోబినోద్దీన్ పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను
పరిరక్షించాలి
కాటారం: ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా అక్రమార్కులు ప్రభుత్వ భూముల పట్టాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి చెందిన పలు రకాల భూములను అక్రమార్కులు కబ్జా చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి భూ భారతిలో దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ భూములు ఉంటే తిరస్కరించాలని కోరారు.
మావోయిస్టులకు
వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని తోగుగూడెంలో మావోయిస్టు ఆత్మపరిరక్షణ ప్రజాఫ్రంట్ తెలంగాణ పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం వాల్‌పోస్టర్లు వెలిశాయి. అడవిని, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రండి.. మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు వెలువడంతో చర్చనీయాంశంగా మారింది.

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం