
బాధ్యతగా పనిచేయకుంటే చర్యలు
గణపురం: ప్రతీఒక్కరు బాధ్యతగా పనిచేయాలని లేదంటే చర్యలు తప్పవని డీఆర్డీఓ బాలకృష్ణ అన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధిహామీ పనులపై సోమవారం ఎంపీడీఓ భాస్కర్ అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 17వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో జరిగిన రూ.3.81 కోట్ల పనులకు సంబంధించి వారం రోజులుగా తనిఖీ బృందాలు గ్రామాల్లో పరిశీలించి తయారు చేసిన నివేదికలపై జిల్లా విజిలెన్స్ అధికారి రుబీనా, క్వాలిటీ కంట్రోల్ అధికారి ధరమ్ సింగ్‌తో కలసి సమీక్ష నిర్వహించారు. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ పనులు కల్పించకపోవడం, మస్టర్ల నమోదులో వ్యత్యాసాలు, మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, రికార్డులు సక్రమంగా లేకపోవడం వంటి అంశాలను తనిఖీ బృందాలు ప్రజావేదిక ముందు పెట్టాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. జాబ్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి పనులు కల్పించాలని అవసరమనుకుంటే అదనంగా పనులు గుర్తించి అనుమతులు పొందాలన్నారు. చేసిన పనులకు సంబంధిత కూలీల సమక్షంలో కొలతలు నమోదు చేయాలని చెప్పారు. రికార్డులు సరిగా లేకపోతే సంబంధిత శాఖ అదికారులు ఇంటింకి పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు తీరు సరిగా లేకున్నా తొలగించే అధికారం ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్పీ రంజిత్ కుమార్, ఏపీఓ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి
డీఆర్డీఓ బాలకృష్ణ