మీ వివరాలు మీరే ! | - | Sakshi
Sakshi News home page

మీ వివరాలు మీరే !

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

జిల్లాలో స్వీయ గణన ప్రారంభం

జనగామ: జనగణన 2027 సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌తో డిజిటల్‌ దిశగా కీలక అడుగు వేస్తోంది. ఇందులో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పౌరులే స్వయంగా తమ కుటుంబ, గృహ వివరాలను నమోదు చేసుకునే సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా ఇంటింటికీ వెళ్లే ఎన్యుమరేటర్లపై భారం తగ్గడంతో పాటు, డేటా కచ్చితత్వం పెరుగుతుందని అధికారులు తెలిపారు.

1,169 ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు

జిల్లాలో 281 గ్రామ పంచాయతీల పరిధిలో రిజర్వుతో కలుపుకుని 994 మంది ఎన్యుమరేటర్లు, రిజర్వు కలుపుకుని 174 సూపర్‌వైజర్లు కలుపుకుని మొత్తం 1,168 మంది ఇంటింటి గణన కోసం సేవలు అందించనున్నారు. 2027లో ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు నిర్వహించనున్న జనగణన నేపథ్యంలో ఈ నెల 26 నుంచి మే 10 వరకు ఇంటింటి గణన జరుగనుంది.

33 ప్రశ్నలకు సమాధానం

సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌లో భాగంగా పౌరులు ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయి 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌ ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఉద్యోగాలు, వలసలతో అందుబాటులో లేని వారికి మంచి అవకాశం. ఈ పోర్టల్‌ తెలుగుతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. యూజర్‌ ఫ్రెండ్లీ డిజైన్‌, టూల్‌ టిప్స్‌, ట్యుటోరియల్‌ వీడియోలతో సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. మల్టీ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌, డేటా ఎన్‌క్రిప్షన్‌ ద్వారా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా, పిన్‌కోడ్‌, గ్రామం లేదా పట్టణం ఆధారంగా లొకేషన్‌ గుర్తించే స్మార్ట్‌సెర్చ్‌ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.

ఇళ్ల జాబితాలో అడిగే ప్రశ్నలు

ఇల్లు సంబంధిత వివరాలు, జనగణన జాబితా నెంబర్‌, ఇంటి ఫ్లోర్‌, ఇంటిని ఎలా వాడుతున్నారు (నివాస/వాణిజ్య/ఇతర), ఇల్లు బలహీన స్థితిలో ఉందా. ఇల్లు నివసించడానికి అనుకూలమేనా.. ఇంటి సభ్యుల వివరాలు, కుటుంబ సభ్యుల మొత్తం సంఖ్య. ఇంటి పెద్ద ఎవరు.. ఏ వర్గానికి చెందిన వారు. ఇంటి నిర్మాణం, వినియోగం, ఇల్లు సొంతమా, అద్దె ఇల్లా, గదుల సంఖ్య, వంటగది, ఇంటికి డ్రైనేజ్‌, విద్యుత్‌, తాగునీటి ప్రధాన వనరు, విద్యుత్‌, సోలార్‌, డిజిటల్‌ సదుపాయాలు, రేడియో, టీవీ, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, ఫోన్లు, వాహనాల సంఖ్య.

ప్రారంభమైన స్వీయ గణన

జిల్లాలో జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుటుంబ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. ఆదివారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు, ముందుగా స్వీయ గణన నమోదుపై మాస్టర్‌ ట్రెయినర్‌ రామరాజు ఆధ్వర్యంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ర్వహించారు. అధికారిక వెబ్‌ పోర్టల్‌ ద్వారా సులభంగా కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చు. ఈసారి జనగణనలో మొదటిసారిగా స్వీయ గణనను ప్రవేశపెట్టారు. కలెక్టర్‌ వెంట సీపీఓ చిన్న కోట్య నాయక్‌ ఉన్నారు.

మే 10 వరకు అవకాశం

పూర్తి భద్రతతో డిజిటలైజేషన్‌

మ్యాప్‌లో ఇల్లు పిన్‌ చేయడం కీలకం

33 ప్రశ్నలకు సమాధానాలు

రిజిస్ట్రేషన్‌ ఎలా చేయాలి

https://se.census.gov.in లాగిన్‌ కావాలి

రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఎంచుకోవాలి

క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి

కుటుంబ యజమాని పేరు నమోదు చేయాలి

ఒక కుటుంబానికి ఒక మొబైల్‌ నెంబర్‌ మాత్రమే ఉపయోగించాలి

మీకు నచ్చిన భాష ఎంచుకోండి

మొబైల్‌కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేయాలి

లొకేషన్‌–అడ్రస్‌ వివరాలు

జిల్లా, పిన్‌కోడ్‌, గ్రామం, పట్టణం వివరాలు నమోదు చేయాలి

మ్యాప్‌లో ఉన్న రెడ్‌ మార్కర్‌ను కచ్చితంగా మీ ఇంటిపైకి డ్రాగ్‌ చేయాలి

ఇళ్ల జాబితా ప్రశ్నలు పూర్తి చేసి, అందులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. తదనంతరం వివరాలను సమీక్ష చేసి, ఫైనల్‌ సబ్మిట్‌ క్లిక్‌ చేయండి.

సబ్మిట్‌ చేసిన తర్వాత ‘హెచ్‌’ తో మొదలయ్యే 11 అంకెల ఎస్‌ఈ ఐడీ జనరేట్‌ అవుతుంది. సెన్సస్‌ సిబ్బందికి ఐడీ చూపించాలి. వారు మ్యాప్‌ చేసిన వెంటనే ఇంటి గణన పూర్తవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement