మా వడ్లు కొనండి సారూ ! | - | Sakshi
Sakshi News home page

మా వడ్లు కొనండి సారూ !

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ పరిధి కాటన్‌ యార్డులో ఈ నెల 19న ప్రారంభమైన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంతో మ్యాపింగ్‌ పరిమితుల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. చీటకోడూరు క్లస్టర్‌లోని చీటకోడూరు, జనగామ, యశ్వంతపూర్‌ గ్రామాలకు చెందిన రైతుల ధాన్యాన్ని మాత్రమే ఈ కేంద్రంలో కొనుగోలు చేసేలా అధికారికంగా మ్యాపింగ్‌ చేశారు. అయితే కొనుగోలు కేంద్రం ప్రారంభానికి ముందే జనగామ మండలంలోని మరిగడి, గానుగుపహాడ్‌, చౌడారం, షామీర్‌పేట్‌, పెద్దపహాడ్‌, వడ్లకొండ, రామచంద్ర గూడెం, కళ్లెం తదితర గ్రామాలకు చెందిన రైతులు ధాన్యం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇతర గ్రామాలకు చెందిన ధాన్యం సుమారు 15 నుంచి 20 వేల బస్తాల వరకూ నిల్వ ఉంది.

మ్యాపింగ్‌తో ఇక్కట్లు..

ధాన్యం కేంద్రాలకు వెబ్‌సైట్‌లో ముందుగా నిర్ణయించిన మ్యాపింగ్‌ కారణంగా, కేంద్ర పరిధిలోకి రాని గ్రామాల రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సుమారు 8 గ్రామాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని అమ్మలేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీసుకొచ్చిన ధాన్యం నిల్వ ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి, ఇప్పటికే యార్డుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే, తాము తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ సమస్యపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి, తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. కాగా, కేంద్రం పరిధిలో ఉన్న చీటకోడూరు కొంతమేర భూములు చౌడారం రెవెన్యూ పరిధిలో ఉండడంతో ఇక్కడ సైతం ధాన్యం కొనుగోలు సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

కాటన్‌ యార్డులోని కొనుగోలు కేంద్రంలో ‘మ్యాపింగ్‌’ కష్టాలు

పరిధిలో లేని గ్రామాల ధాన్యం కొనని నిర్వాహకులు

కేంద్రం ఏర్పాటుకు ముందే తీసుకొచ్చిన రైతులు

తమ ధాన్యం కొనాలని 8 గ్రామాల అన్నదాతల ఎదురుచూపులు

కేంద్రంలో 15వేల నుంచి 20వేల బస్తాలు

Advertisement
 
Advertisement
Advertisement