నేడు మోహిని ఏకాదశి | - | Sakshi
Sakshi News home page

నేడు మోహిని ఏకాదశి

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

జనగామ: వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చే పవిత్రమైన మోహిని ఏకాదశి వ్రతాన్ని జిల్లావ్యాప్తంగా భక్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో ఆచరించేందుకు సిద్ధమయ్యారు. పురాణాల్లో మహావిష్ణువు మోహిని అవతారాన్ని స్మరించుకునే సందర్భంగా భావించే ఈ ఏకాదశి రోజున ఉపవాసం, జపం, ధ్యానం చేయడం శ్రేష్టఫలితాలను ఇస్తుందని పండితులు పేర్కొంటున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకూ విష్ణు ఆలయాలు ఇప్పటికే వేడుకలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా జనగామ పట్టణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి, చెన్నకేశ్వర, శ్రీ సంతోషీమాత ఆలయాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించనున్నారు. మహిళలు ప్రత్యేకంగా తులసి పూజలు, విష్ణుసహస్రనామ పారాయణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సీసీ రోడ్డు పనుల ప్రారంభం

జనగామ రూరల్‌: మండలంలోని పెంబర్తి గ్రామంలో రూ.పది లక్షలతో సీసీ రోడ్డు పనులను ఆదివారం ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్‌ హయాంలో ఇంది రమ్మ ఇళ్లు, రోడ్ల నిర్మాణాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ చిన్నబోయిన రేఖ, గ్రామస్తులు పాల్గొన్నారు.

రామప్పలో విదేశీయుల సందడి

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం కామెరూన్‌ దేశానికి చెందిన సోనిలీ, ఫ్రాన్స్‌ దేశానికి ఇవాన్‌ వెబర్‌ వేర్వేరుగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప ఆలయ చరిత్ర గురించి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ వివరించగా వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్‌ చేశారు.

‘అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు’

ధర్మసాగర్‌: ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య అన్నారు. ధర్మసాగర్‌ మండలం పెద్దపెండ్యాలలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల సొంతింటి కల కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే నెరవేరుతుందని పేర్కొన్నారు. అంతకుముందు పెద్ద పెండ్యాల జీపీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీకి సర్పంచ్‌, పంచాయతీ అధికారులు స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement