నాణ్యత లేకుండా రోడ్డు వేస్తారా? | - | Sakshi
Sakshi News home page

నాణ్యత లేకుండా రోడ్డు వేస్తారా?

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో త్వరలో నిర్వహించనున్న కాటమయ్య పండుగ కోసం గుడి వద్ద చేపడుతున్న సీసీ రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేపడుతున్నారని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు పొన్న రాజేష్‌, బాలగాని అనీల్‌గౌడ్‌, తాటికొండ మధు, బూర్ల రాజేశ్వర్‌, చల్లా రమ్యరఘురెడ్డి ఆదివారం సాయంత్రం అడ్డుకున్నారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులు నాసిరకంగా ఉన్నాయనే సమాచారంతో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పనులకు గోదావరి ఇసుకను కాకుండా పక్కనే ఉన్న వాగుకు చెందిన దుబ్బ ఇసుకను వాడుతున్నట్లు వారు గుర్తించారు. అదేవిధంగా సీసీ పనులు చేసేవద్ద ఎలాంటి చదును చేయకుండా, కనీసం కింద కవర్‌ సైతం వేయకుండా పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పనులు చేస్తున్న వారితో వాగ్వాదం చేసి అడ్డుకున్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ సదరు పనులు చేస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కాంగ్రెస్‌ నాయకులతో కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌ అక్కడికి చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల వాదన విన్న చైర్మన్‌ సానుకూలంగా స్పందించారు. నిబంధనల మేరకు పనిచేయకుంటే సహించేది లేదని, నాసిరకంగా పనులు చేస్తే తప్పక తగిన చర్యలు ఉంటాయని చెప్పడంతో వారు శాంతించారు.

ఛాగల్లులో పనులు అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

కాంగ్రెస్‌ నాయకులతో వాగ్వాదం

Advertisement
 
Advertisement
Advertisement