యాదాద్రి– వరంగల్ హైవేపై పూర్తికాని సర్వీసు రోడ్లు, రెయిలింగ్ పనులు
అసలు
అయిపాయే..
సర్వీసు రోడ్లు లేక ప్రజల అవస్థలు
గ్రామాల్లో సర్వీసు రోడ్లు లేకపోవడంతో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట ప్రజల సౌకర్యం కోసం తప్పనిసరిగా సర్వీసు రోడ్లు వేయాలి. సర్వీసు రోడ్డుపై నుంచి ప్రజలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా మధ్యలో రెయిలింగ్ వేయాలి. సర్వీసు రోడ్డుకు, జాతీయ రహదారికి మధ్య హైమాస్ట్ లైట్లు పెట్టాలి. సర్వీసు రోడ్డు పక్కన డ్రెయినేజీలు పూర్తి చేసి ఆ నీరు ఇళ్లలోకి రాకుండా ఏర్పాటు చేయాలి. అయితే సంబంధిత అధికారులు కేవలం జాతీయ రహదారి విస్తరణ చేశారేగాని సర్వీసురోడ్లు, రెయిలింగ్ పనులు విస్మరించారు. కొన్ని గ్రామాల్లో సర్వీసు రోడ్లు కొంతమేర వేసి వదిలేశారు.
స్టేషన్‌ఘన్‌పూర్: జిల్లాలో జాతీయ రహదారి పనుల విషయంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో సర్వీస్‌రోడ్లు, రెయిలింగ్‌లు, డ్రెయి నేజీ పనులు అరకొరగా అసంపూర్తిగా చేయగా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా జాతీ య రహదారి పనుల పరిస్థితి అసంపూర్తిగా ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడినా అధికారులు, పాలకులకు పట్టడం లేదు. పనులు పూర్తి చేయాల్సిన గడువు ముగి సి ఏడేళ్లయినా పనుల పూర్తికి మోక్షం కలగడం లేదు. కేవలం ప్రధాన రహదారి పనులపై దృష్టి సారించి రహదారి వెంట ఉన్న గ్రామాల్లో సర్వీసు రోడ్లు, రెయిలింగ్‌లు చేపట్టలేదు. అసలు పనులను పూర్తి చేసిన అధికారులు కొసరు పనుల్లో జాప్యం చేస్తున్నారు.
2015లో మొదలైన పనులు..
జాతీయ రహదారి 143 విస్తరణ పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో రూ.1,920 కోట్లతో యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రహదారి విస్తరణ పనులకు రూ.897.03కోట్లు, మిగిలిన రూ.1,022.97కోట్లు భూసేకరణ, ఇళ్ల యజమానులకు కేటాయించారు. 2016 జూన్ 1న నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పనులకు శంకుస్థాపన చేయగా ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు చేపట్టింది. యాదాద్రి జిల్లా వంగపల్లి నుంచి వరంగల్ జిల్లా ఆరెపల్లి వరకు 99.10 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులను 30 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. వాస్తవానికి 2019 జనవరి వర కు పనులు పూర్తి కావాల్సి ఉంది. గడువు ముగిసి ఏడేళ్లయినా పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు.
జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. జిల్లాలోని లింగాలఘణ పురం, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల్లో పలు చోట్ల సర్వీసు రోడ్డు పనులు పూర్తి చేయలేదు. యూటర్న్‌లు లేకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చి పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లిలో హైదరాబాద్, జనగామ నుంచి హన్మకొండవైపు వచ్చే ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి రాకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర సమస్యగా మారింది. సర్వీసు రోడ్లపై ఎండలో నిల్చుని బస్సులను ఆశ్రయిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో సర్వీసు రోడ్లు అసంపూర్తిగా వేశారు. స్థానిక బస్టాండ్ నుంచి శ్రీవాణి గురుకులం వరకు సర్వీసు రోడ్డు వేయాల్సి ఉండగా కేవలం విద్యుత్‌సబ్‌స్టేషన్ వరకే వేసి వదిలేశారు. దీంతో సర్వీసు రోడ్డు నిరుపయోగంగా మారగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్‌లో రహదారికి రెండువైపులా ఇంతవరకు సర్వీసు రోడ్లు వేయలేదు. కొత్తపల్లి క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపైకి ప్రజలు నేరుగా వస్తుండగా పలురోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హైమాస్ట్ లైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి సర్వీసు రోడ్లు, రెయిలింగ్ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
1. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్డు
2. ఘన్‌పూర్ బస్టాండ్ వద్ద సర్వీసురోడ్డుపై ప్రమాదకరంగా బస్సులు ఎక్కుతున్న ప్రజలు
3. రాఘవాపూర్‌లో కంకరపోసి వదిలేసిన రోడ్డు
బస్సుల కోసం అవస్థలు
హైదరాబాద్, జనగామ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి రావడం లేదు. రహదారి పక్కన సర్వీసు రోడ్డుపై బస్సులు నిలుపుతుండగా బస్సుల కోసం ప్రయాణికులు జాతీయ రహదారిని ప్రమాదకరంగా దాటాల్సి వస్తోంది. ఈ విషయమై అధికారులు వెంటనే స్పందించాలి.
– మునిగెల రాజు, స్టేషన్‌ఘన్‌పూర్
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
ఘన్‌పూర్‌లో సర్వీసు రోడ్డు విషయంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇప్పటికై నా స్పందించి ఘన్‌పూర్‌తో పాటు గ్రామాల్లో సర్వీసు రోడ్లు, రెయిలింగ్, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి.
– మారెపల్లి ప్రసాద్, స్టేషన్‌ఘన్‌పూర్
2
నిర్మాణ పనులకు గడువు ముగిసి ఏడేళ్లు
రోడ్డు ప్రమాదాలతో ప్రజలకు ఇక్కట్లు
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి..
పట్టింపులేని పాలకులు, అధికారులు


