వరంగల్ ట్రైసిటీలో డ్రెయినేజీ ఓవర్‌ఫ్లో హాట్‌స్పాట్స్ కొన్ని.. (డీపీఆర్ ప్రకారం)
రూ.5,257 కోట్లకు ఇటీవల పరిపాలన అనుమతి
సాక్షిప్రతినిధి, వరంగల్:
వరంగల్ నగరంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టు వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. సుమారు 40 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు మోక్షం కలగలేదు. పలుమార్లు ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వాలకు పంపించినా ఏదో ఒక కారణంతో ఆచరణకు నోచుకోలేదు.ఎట్టకేలకు యూజీడీ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.5,257 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వగా.. పనుల ప్రారంభం కోసం కసరత్తు జరుగుతోంది.
యూజీడీ లేక రోడ్లపైకి మురుగు నీరు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అంచనాల ప్రకారం సాధారణ సమయంలో నగరంలో రోజుకు సుమారు 180–200 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ మురుగును శుద్ధి చేసేందుకు రెడ్డిపురం, ప్రగతినగర్, ఉర్సుగుట్ట సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎస్‌టీపీ) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 120 ఎంఎల్‌డీలు మాత్రమే శుద్ధి అవుతున్నాయి. మిగిలిన మురుగు నీరంతా నగరంలో బంధం చెరువు, ధర్మసాగర్, మడికొండ, గోపాలపూర్, భద్రకాళి, వడ్డేపల్లి తదితర చెరువులతో పాటు ఎస్సారెస్పీ కాల్వలోకి చేరి కలుషితం అవుతున్నాయి. ఇక వర్షాకాలం వస్తే చాలు పలుమార్లు రోడ్లపైకి పారే వరద, మురుగునీరు కారణంగా ప్రధాన కాలనీలు మునిగిపోయిన పరిస్థితి. ఎట్టకేలకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో పాటు టెండర్ల ప్రక్రియను సైతం మొదలెట్టడం చర్చనీయాంశం అవుతోంది.
ఏప్రిల్‌లో సీఎంతో పనులు ప్రారంభం.. నేడు తేదీలు ఖరారయ్యే అవకాశం
యూజీడీ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న వరంగల్ అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖతో కలిసి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్‌లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరులో యూజీడీ పనుల టెండర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ల ప్రక్రియ ఈ నెలలో పూర్తి చేసి వచ్చే నెలలో సీఎం రేవంత్‌రెడ్డితో శంకుస్థాపన చేయించే యోచనలో నేతలు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యూజీడీ విషయమై కూడా సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది.
త్వరితగతిన నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ
ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ.. అధికారుల కసరత్తు పూర్తి
సకాలంలో పనులు పూర్తయితే ‘గ్రేటర్’కు తప్పనున్న మురుగు, ముంపు
యూజీడీ ప్రాజెక్టు వివరాలు..
ప్రాజెక్టు పేరు: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ
(యూజీడీ)
మొత్తం వ్యయం: రూ. 5,257 కోట్లు
అమలు సంస్థ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్
కార్పొరేషన్
ప్రాజెక్టు లక్ష్యం: ట్రైసిటీలో సమగ్ర యూజీడీ
వ్యవస్థ ఏర్పాటు
పైపులైన్ నెట్‌వర్క్: 740 కిలోమీటర్లు
యూజీడీ జోన్లు: 9
సీవరేజ్ ట్రీట్‌మెంట్ జోన్లు: 21
డ్రెయినేజీ కనెక్షన్లు: దాదాపు
3.15 లక్షల ఇళ్లు
వరంగల్ : గిర్మాజీపేట, శివనగర్, మండిబజార్, మట్టెవాడ, దేశాయిపేట, మిల్స్‌కాలనీ, రాంనగర్, ఆటోనగర్, ఎంజీఎం హాస్పిటల్ పరిసరాలు, హంటర్ రోడ్డు, కరీమాబాద్
హనుమకొండ : సుబేదారి, బాలసముద్రం, అదాలత్ సెంటర్, ఎల్బీనగర్, నయీంనగర్, కిషన్‌పుర క్రాస్, ఎన్జీఓస్ కాలనీ, తిరుమల బార్ చౌరస్తా, అంబేడ్కర్ భవన్ ఏరియా
కాజీపేట : రైల్వే కాలనీ, ఫాతిమానగర్, శివనగర్, గాంధీనగర్, ఎల్‌ఐసీ కాలనీ, డీజిల్ కాలనీ, మడికొండ రోడ్డు పరిసరాలు


