జనగామ: పారిశుద్ధ్య కార్మికుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, కార్యాలయ సిబ్బందికి జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి, మరింత మెరుగైన చికిత్సలు అవసరమున్న వారిని జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజల ఆరోగ్యం కాపాడగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్ కుమార్, 10వ వార్డు కౌన్సిలర్ నీరటి రజిని, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ శానిటరీ ఇన్‌న్‌స్పెక్టర్, జవాను సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గొందాల వాగును పరిశీలించిన కలెక్టర్
జనగామ రూరల్: మండలంలోని గానుగుపహాడ్ గ్రామం నుంచి భాషనగర్ తండాకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న గొందాల వాగును కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా గ్రామంలోని ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ శానబోయిన అనూష మహిపాల్ కలెక్టర్‌ను కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గొందాల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలను కూడా సందర్శించి అక్కడి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్ర శంకర్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో వైద్యశిబిరం ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


