ఐనవోలు: ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర చివరి ఆదివారం మహా పెద్ద పట్నం, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలతో మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో నటరాజస్వామి మండపానికి ఎదురుగా ఉదయం 7 గంటల నుంచే 53 అడుగుల అతిపెద్ద పట్నం 11 రకాల రంగులతో సుమారు 50 మంది ఒగ్గు పూజారులు 6 గంటల పాటు శ్రమించి మహా పెద్దపట్నం వేశారు.
పెద్దపట్నంపైకి ఉత్సవ మూర్తులు
పెద్దపట్నం వేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయ మూల మూర్తులైన అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ, మల్లికార్జునుడి ప్రతిరూపమైన ఉత్సవ విగ్రహాలను ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో మహా పెద్దపట్నంపైకి తీసుకొచ్చారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శైవాగమోక్తంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. అనంతరం కల్యాణ మూర్తులను మహా పెద్దపట్నం చుట్టూ ప్రదక్షిణ గావించి ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు, మంగళ హారతులు స్వామివారికి సమర్పించి అక్షతలను పెద్దపట్నంపై చల్లారు. పూజలు పూర్తయిన వెంటనే శివసత్తులు, ఒగ్గు పూజారులు, భక్తులు తన్మయత్వంతో బండారి (పసుపు) చల్లుకుంటు మహా పెద్దపట్నంపై నృత్యాలు చేసి ఓలలాడారు. అనంతరం ఉత్సవమూర్తులను ఒగ్గు పూజారులు బండారి చల్లుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేదపండిట్లు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు భానుప్రసాద్, మధు, శ్రీనివాస్, నరేశ్, దేవేందర్, ఒగ్గు పూజారులు పెద్ద మనుషులు మజ్జిగ మహేందర్, రాజయ్య, అశోక్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా కల్యాణోత్సం


