కరీంనగర్‌స్పోర్ట్స్: ఒకప్పుడు మన ఇళ్లలోనే యోగం ఉండేది. వాకిట్లో ముగ్గు, వంటింట్లో వంట, ఇంటి శుభ్రత, బట్టల ఉతుకుడు ఇవి కేవలం పనులు కాదు, ఆరోగ్యాన్ని కాపాడే యోగా వ్యాయామాలు. కాలక్రమేణా వాటిని సాధారణ పనులుగా భావించి, ఆరోగ్యం కోసం బయట వెతకడం ప్రారంభించాం. కానీ మన అవ్వలు, అమ్మలు చేసిన ప్రతి ఇంటి పని శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, కుటుంబానికి ప్రేమను అందించే ఇంటి యోగం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేటి ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం కోసం యోగా కేంద్రాలు, జిమ్‌లు, ఫిట్‌నెస్ కార్యక్రమాలకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
వేకువజాము నుంచే మొదలు
వేకువజామున నిద్రలేచి ముగ్గు వేయడం ద్వారా మోకాళ్లు, వెన్నెముకకు వ్యాయామం లభించేది. బట్టలు ఉతకడం, ఆరేయడం వంటి పనులు చేతులు, భుజాలు, నడుంకు బలాన్ని ఇచ్చేవి. ఇల్లు ఊడ్చడం, గిన్నెలు తోమడం వంటి పనులు రక్తప్రసరణను మెరుగుపరచడంతో ఉపయోగపడేవి. ఇక నేటి తరంలో యంత్రాలపై ఆధారపడటం పెరిగింది. ఇంటి పనులు తగ్గి ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి. గంటల తరబడి కూర్చుని పనిచేసే జీవనశైలిలో మెడనొప్పి, నడుమునొప్పి, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు సాధారణమయ్యాయి.
ఇంటి పనులపై
సమాజం చేసిన ప్రధాన తప్పు ఇంటి పనులను తక్కువగా చూడటమే. యోగాసనం పేరుతో చేస్తే గౌరవం, ఇంట్లో చేస్తే సాధారణ పని అనే భావన ఏర్పడింది. ఇంటి పనుల వెనుక ఉన్న ప్రేమ, సేవ, బాధ్యత, కుటుంబ సంక్షేమం వంటి విలువలను మనం మరిచిపోయాం. నిజానికి వంట చేయడం అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు. కుటుంబానికి ఆరోగ్యం, ప్రేమ అందించడం. ఇల్లు శుభ్రం చేయడం అంటే కేవలం దుమ్ము తొలగించడం కాదు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడమని అర్థం.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం


