సిరిసిల్లటౌన్: ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం పోయేలా చేసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన చింత అభిషేక్(29) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రెండు నెలల క్రితం కొడుకు పుట్టగా దైవదర్శనం కోసం ఇంటికి రావాలనుకున్నాడు. బుధవారం రాత్రి విధులు నిర్వర్తించి గురువారం ఉదయం హైదరాబాద్‌లో ప్రైవేటు యాప్ ట్యాక్సీ కారును బుక్‌చేసుకుని ఎక్కాడు. కారు డ్రైవర్ జగిత్యాల జిల్లాకు చెందిన ఆర్మూరి శ్రీకర్, వేములవాడ సోమేశ్‌లను అదే కారులో ఎక్కించుకొని నలుగురు స్వస్థలాలకు బయల్దేరారు. గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో ఆగిఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనుకనుంచి ఢీకొట్టాడు. అభిషేక్‌కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించే సరికి మృతిచెందాడు. మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సంఘటనకు కారణమైన కారు డ్రైవర్ పారిపోవడంతో పోలీసులు వెతికి పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ రోడ్డుపై ఆపడం, కార్‌డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు


