భూ వివాదంలో కార్పెంటర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భూ వివాదంలో కార్పెంటర్‌ ఆత్మహత్య

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

కోల్‌సిటీ: భూమి కొనుగోలు విషయంలో భార్య, బావమరిదితో ఏర్పడిన డబ్బుల వివాదంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. విషాదంలో కూడా కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేసి ఇద్దరికి వెలుగులు పంచేలా చేశారు. వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని మేదర్‌బసీకి చెందిన పొన్నగంటి మధూకర్‌ (39) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భూమి కొనుగోలు కోసం డబ్బులు చెల్లించే విషయంలో భార్య లావణ్య, ఆమె తమ్ముడు గణేశ్‌తో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భూమి కొనుగోలు డబ్బుల విషయంలో భార్య, ఆమె తమ్ముడితో తలెత్తిన గొడవలతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మధూకర్‌ బుధవారం రాత్రి తనసెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశాడు. గమనించిన తండ్రి పొన్నగంటి నందయ్య, తమ్ముడు మాధవాచారి కలిసి ఇంటికి వెళ్లి చూడగా, మధూకర్‌ చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి నేత్రాలను దానం చేసేలా ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాక్‌ టెక్నీషియన్‌ ప్రదీప్‌నాయక్‌ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఇంతటి విషాదంలోనూ ఆయన నేత్రాలను దానం చేయడానికి వారు ముందుకు వచ్చారు. కార్నియాలను సేకరించిన టెక్నీషియన్‌.. సకాలంలో హైదరాబాద్‌కు తరలించారు.

విషాదంలోనూ నేత్రదానం చేసిన కుటుంబసభ్యులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement