మిషన్ 100కు రాష్ట్రపతి అవార్డు
సిరిసిల్లటౌన్: వారంతా ప్రభుత్వ టీచర్లు. స్కూల్‌కు వచ్చామా.. వెళ్లామా.. అని కాకుండా స్కూల్ అభివృద్ధికి ఏం చేశాం.. విద్యార్థుల సర్వోన్నతికి ఎలా పనిచేశామని ప్రశ్నించుకున్న గురువులు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే కాదు.. ఆ విద్యార్థుల విజ్ఞానాభివృద్ధిలో తమ పాత్రను నూరు శాతం నిర్వర్తిస్తున్నారు. గ్రామస్తుల పిల్లలనే కాకుండా తమ పిల్లలను సైతం అదే పాఠశాలలో చదివిపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మసకబారిపోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను వెలికితీసి.. వెలుగులోకి తెచ్చి.. బడిని బతికించిన ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.
సిరిసిల్లటౌన్: పాతికేళ్ల ఉపాధ్యాయ జీవితంలో అంకితభావం, వినూత్న ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ బడిని బలోపేతం చేశారు సంపత్‌కుమార్. గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట హైస్కూల్ సైన్స్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన రూపొందించిన మిషన్ 100 కార్యక్రమం ద్వారా పాఠశాలలో పదేళ్లకు పైగా వరుసగా 100 శాతం ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత సాధించారు. శాసీ్త్రయ దృక్ఫథం పెంచి విద్యార్థులు 20 జాతీయ అవార్డులు, 8 అంతర్జాతీయ అవార్డులు, 25 ఇన్‌స్పైర్ అవార్డులు సాధించారు. జపాన్ సకురా సైన్స్ ప్రోగ్రామ్, ఫైన్–2023, నేషనల్ టెక్నాలజీ వీక్ 2023లో ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది. 2022లో జాతీయ ఉత్తమ అవార్డు, 2020లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.


