కో–ఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

కో–ఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడో..?

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

కథలాపూర్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలు గతేడాది డిసెంబర్‌లో ముగిశాయి. పాలకవర్గాలు కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా.. కో–ఆప్షన్‌ సభ్యుల నియామకం జరగకపోవడంతో పదవులు ఆశిస్తున్న ఆశావహులు నిరాశలో ఉన్నారు. వాస్తవానికి పాలకవర్గం కొలువుదీరిన 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. పంచాయతీ ఎన్నికల తర్వాతే మున్సిపల్‌ ఎన్నికలు జరగాయి. బల్దియాల్లో కో– ఆప్షన్‌ సభ్యులను గతంలోనే నియమించారు. కానీ.. పంచాయతీల్లో జాప్యం చేస్తుండడంపై పలువురు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీకి ముగ్గురు కో– ఆప్షన్‌ సభ్యులు

జిల్లాలో 385 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం పాలకవర్గాలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి కో–ఆప్షన్‌ సభ్యులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రతి పంచాయతీలో ముగ్గరు చొప్పున సభ్యులను నియమించాలి. వారికి వార్డుసభ్యులతో సమాన హోదా ఉంటుంది. ముగ్గురిలో ఒకరు రిటైర్డ్‌ ఉద్యోగి లేదా అనుభవం ఉన్న సీనియర్‌ సిటిజన్‌, మరొకరు గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు, ఇంకొకరు పంచాయతీలకు స్థలం ఇచ్చిన దాతలు లేదా భారీగా విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామాభివృద్ధికి దోహదపడే ఎన్‌ఆర్‌ఐలను నియమించాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో 385 గ్రామపంచాయతీలకు గాను 1,155 మంది సభ్యులకు అవకాశం ఉంది.

సభ్యుల అధికారాలు ఇవే..

కో–ఆప్షన్‌ సభ్యులకు పంచాయతీ సమావేశాల్లో పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చే హక్కు ఉంటుంది. వీరికి వార్డుసభ్యులతో సమానంగా ప్రోటోకాల్‌, గౌరవం దక్కుతుంది. సమావేశాల్లో చర్చించి అవకాశం ఉన్నప్పటికీ తీర్మానాల ఆమోదంలో మాత్రం ఓటు హక్కు ఉండదు. కేవలం పంచాయతీకి సలహాదారులుగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపకల్పనలో వీరి పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రభుత్వం దృష్టిసారించి గ్రామపంచాయతీ కో–ఆప్షన్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై డీపీవో మదన్‌మోహన్‌ మాట్లాడుతూ.. ఎన్నిక విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు.

ఎదురుచూస్తున్న ఆశావాహులు

జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు

1,155 మందికి అవకాశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement