రికార్డు స్థాయిలో వరి, మక్కల కొనుగోలు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాల: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, జిల్లాలో రికార్డు స్థాయిలో వరి, మక్కలు కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు 5.12లక్షల టన్నుల ధాన్యం రాగా.. 436 కేంద్రాల ద్వారా 5.08 లక్షల టన్నులు కొన్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ధాన్యంలో కోత పెడుతున్నట్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు 81,954 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసి రూ.1,075 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. రికార్డు స్థాయిలో 47వేల టన్నుల మక్కలు కొన్నామన్నారు. ధాన్యం క్వింటాల్‌కు 10 కిలోల కోత పెట్టారని జీవన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తమన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ గతంలో కన్న ఈసారి ధాన్యం, మక్కల దిగుబడి ఎక్కువగా వచ్చిందన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, అడిషనల్ కలెక్టర్లు బిఎస్.లత, రాజాగౌడ్ ఉన్నారు.


