● విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
రాయికల్: మండలంలోని ఇటిక్యాలకు చెందిన పల్లపు శేఖర్(35) చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలోని ఒడ్డెరకాలనీకి చెందిన శేఖర్ చేపలు పట్టేందుకు వెళ్లి వస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను గమనించక కాలు వేశాడు. విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. శేఖర్‌కు భార్య, కూతురు ఉన్నారు.
వెల్గటూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని ముత్తునూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగ పోశయ్య (40) బుధవారం ఉదయం తన వ్యవసాయ బావిలోని మోటార్ తీయడానికి వెళ్లాడు. మోటార్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
క్షయ వ్యాధిపై జాగ్రత్తలు తీసుకోవాలి
జగిత్యాల: క్షయ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వారాలు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం వంటి సమస్యలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


