రవి, ఆనంద్ ఇద్దరూ తొమ్మిదో తరగతి చదువుతున్న స్నేహితులు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ‘నేటి సమాజంలో దేశభక్తి’ అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. రవికి సైన్యం అంటే చాలా ఇష్టం. ‘శత్రువుల గుండెల్లో నిద్రపోయే సైనికుడే అసలైన దేశభక్తుడు. ప్రాణత్యాగం చేయడమే దేశభక్తి’ అని తన ప్రసంగంతో అందరినీ ఉద్వేగానికి గురిచేశాడు. అందరూ రవికి మొదటి బహుమతి ఖాయమన్నారు. ఆనంద్ కూడా రవిని అభినందించాడు. తర్వాత తనవంతుగా పోటీలో పాల్గొన్నాడు. ‘అందరినీ సమానంగా చూస్తూ, దేశంలో ప్రశాంత వాతావరణం ఉండడానికి కృషి చేస్తూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడమే నిజమైన దేశభక్తి’ అని ప్రసంగించాడు.
పాఠశాల సమయం ముగిసింది.
రవి, ఆనంద్ ఇంటికి బయలుదేరారు. పాఠశాల బయట మున్సిపాలిటీ వారు తీసిన గుంత సరిగ్గా పూడ్చకపోవడంతో మురికి నీరు చేరి ప్రమాదకరంగా ఉంది. అది గమనించని మూడో తరగతి చదివే చిన్న పిల్లవాడు సైకిల్‌తో ఆ గుంతలో పడిపోయాడు. మోకాలికి దెబ్బ తగిలి ఏడుస్తున్నాడు. రవి తన సైనిక ఆశయాల గురించి, తన ప్రసంగం గురించి ఆనంద్‌తో గొప్పగా చెప్పుకుంటూ ఆ పిల్లవాడిని చూసినా పట్టించుకోలేదు. ‘అబ్బా.. ఇలాంటి గుంతలు మన దేశంలో సాధారణం. అందుకే మన దేశం వెనుకబడి ఉంది’ అని విమర్శిస్తూ ముందుకు సాగాడు. ఆనంద్ ఆగిపోయాడు. పరుగున వెళ్లి ఆ పిల్లాడిని పైకి లేపి, తన దగ్గర ఉన్న రుమాలుతో రక్తాన్ని తుడిచి, పాఠశాలలో ప్రథమ చికిత్స డబ్బాతెచ్చి.. ప్రథమ చికిత్స చేశాడు. మళ్లీ ఎవరూ ఆ గుంతలో పడకూడదని పక్కనే ఉన్న ఒక ఎర్రని బట్టను కర్రకు చుట్టి పాతాడు. అదంతా చూస్తున్న రవి, ‘ఆనంద్, అనవసరంగా సమయం వృథా చేస్తున్నావు.. పద వెళ్దాం. నేను ట్యూషన్‌కు వెళ్లాలి’ అని విసుక్కున్నాడు. ‘అయిపోయింది పదా’ అంటూ ఆనంద్ కదిలాడు. ఇద్దరూ వెళ్లిపోయారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున బహుమతుల ప్రదానం జరుగుతుంది. శ్రీవక్తృత్వ పోటీలో రవి ప్రసంగం చాలా బాగుంది. ఆనంద్ కూడా చాలా బాగా ప్రసంగించాడు. ఆ ప్రసంగంలోని ఆశయాన్ని నిజజీవితంలో పాటించిన ఆనంద్‌కు ‘బెస్ట్ స్టూడెంట్’ అవార్డు ఇస్తున్నాను.. అన్నారు ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థులందరూ చప్పట్లు కొట్టారు. ఆయన శాంతంగా
‘దేశభక్తి అంటే కేవలం చెప్పడం కాదు, లేదా సరిహద్దుకు వెళ్లినప్పుడే చూపించేది కాదు. మన రాజ్యాంగం మనకు హక్కులతోపాటు కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. నిన్న దారిలో దెబ్బ తగిలిన పిల్లవాడికి సాయం చేయడం, మరో వ్యక్తి ప్రమాదంలో పడకుండా గుంత దగ్గర హెచ్చరిక ఏర్పాటు చేయడం.. ఇవే నిజమైన పౌరబాధ్యతలు. ఒక సైనికుడు దేశాన్ని బయటి శత్రువుల నుంచి రక్షిస్తే, ఆనంద్ లాంటి పౌరులు దేశాన్ని లోపల ఉండి రక్షిస్తున్నారు. తోటి మనిషికి సాయపడలేని దేశభక్తి వృథా.. అని బహుమతిని ఆనంద్‌కు ప్రదానం చేశాడు. రవికి తన తప్పు తెలిసొచ్చింది. నిజమైన దేశభక్తి అనేది తుపాకీ పట్టినప్పుడే కాదు, తోటి వారికి సహాయపడినప్పుడు కూడా కనిపిస్తుందని గ్రహించి, ఆనంద్‌ను ఆలింగనం చేసుకున్నాడు.
– ఆవుల చక్రపాణి యాదవ్
గ్రామం : కన్నమడకల
ఓర్వకల్లు పోస్ట్
కర్నూలు(జిల్లా) ఆంధ్రప్రదేశ్


