కరువు ఏర్పడితే రేవంత్‌ వైఫల్యమే | - | Sakshi
Sakshi News home page

కరువు ఏర్పడితే రేవంత్‌ వైఫల్యమే

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

తన ఫ్యూచర్‌ తప్ప ప్రజలను పట్టని ముఖ్యమంత్రి ఏటా లక్ష ఉద్యోగాలని మూడేళ్లలో కేవలం 17వేలే.. రేవంత్‌ చేతిలో అన్నివర్గాలూ మోసపోయాయి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి

జగిత్యాలటౌన్‌: పోలవరానికి లోపాయికారిగా సహకరించి తెలంగాణను ఏడారిగా మార్చే కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్లు కుంగితే మరమ్మతు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిగ్గుపడాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చి 30నెలలు గడుస్తున్నా సాగునీటి ప్రాజెక్టులకు కనీసం డిజైన్లు రూపొందించలేని దుస్థితిలో రేవంత్‌ ప్రభుత్వం ఉందన్నారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు తుమ్మిడిహట్టి పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆసిఫాబాద్‌ జిల్లాకు వెళ్లిన సీఎం తుమ్మిడిహట్టిని ఎందుకు సందర్శించలేదో చెప్పాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయి కరువు బారిన పడే ప్రమాదం పొంచిఉందని, అలాంటి దుస్థితే వస్తే ముమ్మాటికీ రేవంత్‌ వైఫల్యమేనన్నారు. తన కుటుంబ లబ్ధికోసం ఫ్యూచర్‌ సిటీ అంటున్న సీఎం.. ప్రజల భవిష్యత్తును గాలికొదిలేశారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేరుగా మాట్లాడలేని సీఎం 152మీటర్ల వద్ద ప్రాజెక్టు నిర్మిస్తాననడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కాంగ్రెస్‌లో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటారో ఎవరికీ తెలియదని, 2034 వరకు తానే సీఎం అంటున్న రేవంత్‌ మాటలు హాస్యాస్పదమన్నారు. ఏడాదికి లక్ష చొప్పున ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 17వేలేనన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు లేవని, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, రేవంత్‌ చేతిలో మోసపోని వర్గం లేదంటే అతిశయోక్తి కాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు గోదావరి జలాలతో ముడిపడి ఉందని గుర్తించిన కేసీఆర్‌ గోదావరి జలాల్లో హక్కును కోల్పోకూడదనే లక్ష్యంతో కాళేశ్వరం, మేడిగడ్డ వంటి ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కేసీఆర్‌ అవసరం ఉందని ప్రజలు గుర్తించారని, రేవంత్‌ ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు హరిచరణ్‌రావు, గాజుల రాజేందర్‌, జున్ను రాజేందర్‌, పుప్పాల అశోక్‌, దుర్గయ్య, ధర రమేష్‌, రఘువీర్‌, గుండ మధు, నేహాల్‌, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement