కుప్పకూలుతున్న ‘లిఫ్ట్‌’! | - | Sakshi
Sakshi News home page

కుప్పకూలుతున్న ‘లిఫ్ట్‌’!

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

నాసిరకం లిఫ్ట్‌ల వినియోగంతో ప్రాణాలకు ముప్పు

పెరుగుతున్న నిర్లక్ష్యం.. తరచూ ప్రమాదాలు

భద్రతా ప్రమాణాలు పాటించని భవనాలు, మాల్స్‌ యాజమాన్యాలు

ఇటీవల ఓ వ్యక్తి కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా లిఫ్ట్‌ వైర్‌ తెగడంతో ఒక్కసారిగా కిందపడింది. అందులో ఉన్న మంత్రి అడ్లూరికి పెనుప్రమాదం తప్పింది.

కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం కాంగ్రెస్‌ నాయకుడు ఆరెపల్లి మోహన్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు నాయకులు హాజరయ్యారు. అనంతరం ఫంక్షన్‌హాల్‌ రెండో ఫ్లోర్‌ నుంచి ఎమ్మెల్యే, ఆరెపల్లి, నాయకులు లిఫ్ట్‌లో దిగుతుండగా ఒక్కసారిగా కిందపడడంతో ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఏం కాకపోవడంతో అంత ఊపరిపీల్చుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఇటీవల ఓ అధికారి లిఫ్ట్‌లో కిందకు దిగుతుండగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో సదరు అధికారి ఫైర్‌ విభాగం అధికారులకు ఫోన్‌ చేశాడు. తర్వాత సంబంధిత టెక్నీషియన్‌ పిలిపించి నెమ్మదిగా కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. అలాగే సిరిసిల్ల మార్కెట్‌ ప్రాంతంలోని ఓ భవనంలో సైతం ఇలాంటి ప్రమాదమే జరిగింది.. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లిఫ్టుల వైఫల్యంతో చాలా ప్రమాదాలు తప్పడం చూస్తున్నాం. వీటిపై నిర్వహణపై తనిఖీలు చేసే అధికార యంత్రంగాం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

కరీంనగర్‌క్రైం: నగరంలో నిర్మిస్తున్న వివిధ భవనాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, షాపింగ్‌మాల్స్‌, ఆసుపత్రులు, కళాశాలలు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తక్కువ ఖర్చుతో లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాటికి అవసరమైన వార్షిక తనిఖీలు, సాంకేతిక పరీక్షలు, అత్యవసర భద్రతా పరికరాల అమరిక వంటి అంశాలను చాలా చోట్ల పట్టించుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. లిఫ్ట్‌లలో ఉండాల్సిన ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఓవర్‌లోడ్‌ సెన్సర్లు, ఎమర్జెన్సీ అలారం, బ్యాకప్‌ పవర్‌ వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది.

భయపెడుతున్న ఘటనలు

ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లాలోని పలు ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌, అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్‌లు నిలిచిపోవడం, ఒక్కసారిగా కిందకు జారిపడడం, గంటల తరబడి వాటిలో పలువురు చిక్కుకుపోవడం వంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, హెచ్చరికలు కనిపిస్తున్నా కొంతకాలానికే పరిస్థితి మామూలుగా మారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా లిఫ్ట్‌ల వద్ద ఎంతమంది కెపాసిటీ, ఎన్ని కేజీలు వెళ్లాలనే సమాచారం చాలా చోట్ల కనిపించదు. ఏదైనా ఘటన జరిగితే ఎవరికి ఫోన్‌చేయాలో సమాచారం ఉండడం లేదు. వీటి నియంత్రణ మొత్తం సంబంధిత యాజమాన్యాల చేతిలో ఉండడం, వారు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణకు ప్రత్యేక చట్టమే లేదు

మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో లిఫ్టులకు ప్రత్యేక చట్టం, చట్టానికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో విభాగం ఉంటుంది. నిర్ణీత ప్రాంతాల్లో ఎన్ని లిఫ్టులు ఉన్నాయనే సమాచారం, ఇన్‌స్టాలేషన్‌, మెయింటనెన్స్‌, వివిధ సమస్యలపై ఎప్పుటికప్పుడు సదరు అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు లిఫ్టులకు ప్రత్యేక చట్టం ఏమీ లేదు. లిఫ్టుల నిర్వహణ అంశంపై ఇటీవల జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ప్రభుత్వం తెలంగాణ లిఫ్ట్‌స్‌ యాక్టును తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు, పలుమార్లు హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు సమాచారం.

కఠిన చర్యలే పరిష్కారం

ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రస్తుతం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇతర నాయకులకు తృటిలో తప్పిన ప్రమాదం ఒక హెచ్చరికగా భావించాల్సిన అవసరం ఉంది. నాసిరకం లిఫ్టులు ఏర్పాటు చేసే సంస్థలు, నిర్వహణలో నిర్లక్ష్యం వహించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నాసిరకం లిఫ్టులపై అధికారులు ఇప్పటికై నా దృష్టి సారిస్తారా? లేక మరో పెద్ద ప్రమాదం జరిగిన తర్వాతే స్పందిస్తారా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, చట్టం లేకపోయినా బాధ్యతగా లిఫ్ట్‌లు నిర్వహిస్తున్నప్పుడు ఎంత మంది కెపాసిటీ వెళ్లాలి, ఏమైనా అయితే యాజమాన్యం, టెక్నీషియన్‌ల నంబర్లు ఏర్పాటు చేయడం కనీస బాధ్యత అని గుర్తుంచుకోవాలని డివిజన్‌ ఫైర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement