కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన భవన నిర్మాణ రంగ కార్మికురాలు నర్ర సుజాత(40) వడదెబ్బతో శనివారం మృతిచెందింది. పెద్దరాతుపల్లిలో తాపీమేసీ్త్రగా పనిచేస్తున్న భర్త నర్ర సదానందంతో కలిసి శుక్రవారం పనులకు వెళ్లింది. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురికావడంతో ఇద్దరూ ఇంటికి వచ్చారు. విరోచనాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పతికి అక్కడి నుంచి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ టాయిలెట్ గదిలోకి వెళ్లి కుప్పకూలి మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు శ్రీహర్షవర్ధిని, మనోరుత్విక్ ఉన్నారు. తల్లి హఠాన్మరణంతో చిన్నారులు, భర్త రోదనలు మిన్నంటాయి.
వీణవంక మండలంలో ఒకరు..
వీణవంక: మండలంలోని పోతిరెడ్డిపల్లికి చెందిన కొమిరే వనజ(45) వడదెబ్బకు గురై శనివారం మృతిచెందింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన వనజ పనులు ముగించుకొని ఇంటికి చేరుకోగా వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది.


