జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీతో సుధీర్ఘ అనుబంధం కలిగిన జీవన్‌రెడ్డి పార్టీ వీడాలనుకోవడం బాధాకరమని, చివరి నిమిషంలో అద్భుతం జరిగి ఆయన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఏఐసీసీ పరిశీలకులు కత్తి వెంకటస్వామి అన్నారు. అవమానాలు భరించలేక కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు బుధవారం జగిత్యాలలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. దాదాపు గంటపాటు జరిగిన భేటీ అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడడం పార్టీకి ఆశనిపాతం అవుతుందన్నారు. జీవన్‌రెడ్డి పార్టీలో కొనసాగాలని రాహుల్‌గాంధీ కోరుకుంటున్నారని తెలిపారు. ఆయనను ఒప్పించి పార్టీలో కొనసాగాలని కోరేందుకే పార్టీ దూతగా తాను వచ్చినట్లు తెలిపారు. ఆయన ఎంతో ఆవేదన చెందితే తప్ప పార్టీతో ఉన్న సుధీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవాలని కోరుకోరని, పార్టీ కూడా అలాంటి నాయకుడిని వదులుకునేందుకు సిద్ధంగా లేదని వివరించారు. జీవన్‌రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ఏదైనా అద్బుతం జరిగే అవకాశం లేకపోలేదన్నారు.
● మాజీమంత్రి జీవన్‌కు బుజ్జగింపులు
● ఆఖరి నిమిషంలో అద్భుతం జరగొచ్చు
● ఏఐసీసీ పరిశీలకుడు కత్తి వెంకటస్వామి


