కలగానే ఉద్యాన పరిశోధన కేంద్రం | - | Sakshi
Sakshi News home page

కలగానే ఉద్యాన పరిశోధన కేంద్రం

Mar 22 2026 5:28 AM | Updated on Mar 22 2026 5:28 AM

● ప్రదర్శన క్షేత్రం స్థలంపై ప్రజాప్రతినిధుల చూపు ● రకరకాల ప్రతిపాదనలతో ప్రభుత్వం వద్దకు పాలకులు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాకేంద్రం శివారు చల్‌గల్‌లోని ఉన్న వాలంతరీ స్థలంపైనే ప్రజాప్రతినిధుల చూపు పడింది. జిల్లాకు మంజూరయ్యే ప్రతి అభివృద్ధి పనికి ఇక్కడి స్థలాన్ని ఇవ్వాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తుండడం పారిపాటిగా మారింది. దీంతో విలువైన భూములను రైతులకోసం ఇస్తే.. ఇప్పుడు రైతులను కాదని ఇతర పనులకు వాలంతరీ స్థలాన్ని ఉపయోగించడంపై రైతులు గుర్రుగా ఉన్నారు.

సాగునీటి పద్ధతులు వివరించేందుకు..

ఎస్సారెస్పీ నిర్మాణ దశలో సాగునీటిని పంటలకు ఎలా ఉపయోగించాలి..? తక్కువ నీటితో పంటలను ఎలా సాగు చేయాలి..? అనే అంశంపై చల్‌గల్‌లో వాలంతరీ సంస్థ(సాగు నీటి యాజమాన్య సంస్థ)ను 120 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. సంస్థ నిధులతో రైతులు, అధికారులకు శిక్షణ ఇచేవారు. వ్యవసాయాధికారులు రకరకాల పంటలను పండించి, ప్రదర్శన క్షేత్రంగా తీర్చిదిద్దారు. ఇప్పటికీ పంటలు పండిస్తున్నారు. దాదాపు 40ఏళ్లుగా ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రపంచ బ్యాంకు, వివిధ రాష్ట్రాలు, దేశాల ప్రతినిధులు సందర్శించారు. ఈ ప్రదర్శన క్షేత్రం కోసం చల్‌గల్‌తో పాటు చుట్టుపక్క గ్రామాల రైతులు తమ విలువైన వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు రూ.కోట్లలో ధర పలికే భూములను రైతులకు పనికొచ్చే పనులకు కాకుండా.. స్టేడియాలు, కాలేజీలు అంటూ ధారాదత్తం చేస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ధారాదత్తం

చల్‌గల్‌ ప్రదర్శన క్షేత్రంలో 120 ఎకరాల స్థలంలో ఇప్పటికే 20 ఎకరాలు మామిడి మార్కెట్‌కు, ఐదెకరాలు రైల్వేలైన్‌కు, ఆరెకరాలు మార్క్‌ఫెడ్‌ గోదాం, ఎకరం వరకు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ఇచ్చారు. మామిడి మార్కెట్‌లో షెడ్ల నిర్మాణానికి మరో 10 ఎకరాలను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది చాలదన్నంటూ ప్రస్తుతం ప్రజాప్రతినిధులు రకరకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తున్నారు. తాజాగా కేంద్రీయ విద్యాలయానికి ఐదెకరాలు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేట్‌డే రెసిడెన్సియల్‌ స్కూల్‌కు 25 ఎకరాలు, క్రీడాకారులు వివిధ ఆటల్లో తర్ఫీదు పొందేందుకు స్టేడియం ఏర్పాటుకు పదెకరాలు కేటాయించాలని కోరారు. మరో పదెకరాలను గోదాంల నిర్మాణానికి ఇవ్వాలని ఎవరికి వారే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నారు.

ఉద్యాన పరిశోధన లేదా కృషి విజ్ఞాన కేంద్రం

జిల్లా పూర్తిగా వ్యవసాయాధారితం. ఇక్కడ వరి, మొక్కజొన్న, పసుపు వంటి సంప్రదాయ పంటలతోపాటు 90 వేల ఎకరాల్లో మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఇటీవల అభ్యుదయ రైతులు డ్రాగన్‌ ప్రూట్‌, జామ, దానిమ్మ వంటి లాభదాయకమైన పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యాన రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే శాస్త్రవేత్తలు మాత్రం అందుబాటులో లేరు. రైతులకు ఉపయోగపడే ఉద్యాన పరిశోధన కేంద్రం లేదా కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

గతంలో రైతులకు ఉపయోగపడేలా..

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చల్‌గల్‌లో ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటయ్యే సమయంలో ఆయన మృతితో ఆగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉత్తర తెలంగాణ రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం రద్దు కావడంతో ఆటకెక్కాయి. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రస్థాయి మామిడి పరిశోధన కేంద్రం చల్‌గల్‌లో ఏర్పాటు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలాసార్లు ప్రకటించినప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. ఇటీవల కేంద్రప్రభుత్వం మంజూరు చేసే కృషి విజ్ఞాన కేంద్రం చల్‌గల్‌లో ఏర్పాటు చేస్తామన్నప్పటికీ అతీగతీ లేదు. ఈ లోపలే ఉన్న స్థలం అంతా రకరకాల పనులకు ఉపయోగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement