ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీని వాసచార్యులు మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
విద్యకు సరిపోని కేటాయింపులు
జగిత్యాల: జనాకర్షణ పథకాలే తప్ప ప్రస్తుత విద్యావ్యవస్థను బాగు చేసేలా బడ్జెట్ కేటాయింపు లేదని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి మచ్చ శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా శాఖ కార్యాలయంలో మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్‌లో విద్య, మానవ వనరులకు కేటాయించింది రూ.26,670 కోట్లు మాత్రమేనని, ఇది బడ్జెట్‌లో 8.2 శాతమేనన్నారు. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్న ప్రతిపాదన ఆహ్వానించదగిందే కానీ, పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంపు గురించి అదనపు నిధుల కేటాయింపు ప్రస్థావన లేదని, గతేడాది 7.58 శాతం కేటాయించగా, ఈసారి 8.22 శాతమే కేటాయించారన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బైరం హరికిరణ్, శివరామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్, ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్ పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వృద్ధులు, యువత, ఒంటరి మహిళలలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతిలో నమోదు చేసుకున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెండు గ్రామాల మధ్య భూ వివాదం
జగిత్యాలక్రైం: బీర్‌పూర్ మండల శివారులోని ఓ స్థలంపై రెండు గ్రామాల మధ్య వివాదం నెలకొంది. దీంతో బీర్‌పూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాలు.. బీర్‌పూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో నర్సింహులపల్లి గ్రామానికి చెందిన కొందరు ప్రార్థన మందిరం ఏర్పాటు చేయడంతో బీర్‌పూర్ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ప్రార్థన మందిరం ఏర్పాటు చేసుకోవడంపై బీర్‌పూర్ వాసులు ఆందోళన చేపట్టారు. కాగా, పోలీసు, రెవెన్యూ అధికారులు అక్కడకు వెళ్లి రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. బీర్‌పూర్ గ్రామ శివారులోని 242 సర్వే నంబరులో ఉన్నది ప్రభుత్వ భూమి అని, ఆ భూమిలో ఎవరూ మతపరమైన కట్టడాలు నిర్మించవద్దని బీర్‌పూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తూ బైఠాయించారు.


