జగిత్యాలఅగ్రికల్చర్: పసుపు పంటకు అంతర్జాతీయంగా మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. జిల్లా రైతులు ఎక్కువగా మహారాష్ట్రలోని సాంగ్లీతో పాటు నిజామాబాద్, జిల్లాలోని మెట్‌పల్లి, జగిత్యాల మార్కెట్‌కు తరలిస్తారు. ప్రస్తుతం ఆయా మార్కెట్లలో పసుపు ఉత్పత్తులకు పలుకుతున్న ధరలు చూసి రైతులు కంగు తింటున్నారు. ఈ ఏడాది ఆశాజనకంగా పసుపు క్వింటాల్‌కు రూ.12– రూ.13 వేల ధర పలికినా, పశ్చిమాసియా యుద్ధంతో క్వింటాల్‌కు రూ.2 వేలు పడిపోయి, రూ.10 వేల నుంచి రూ.11 వేలు మాత్రమే పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి.
రెండో స్థానంలో జగిత్యాల
రాష్ట్రంలో పసుపు సాగులో నిజామాబాద్ తర్వాత జగిత్యాల జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో 25 వేల ఎకరాలకు పైగా పంట సాగు చేయగా, ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 7–8 లక్షల క్వింటాళ్ల పసుపు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం 1–2 లక్షల క్వింటాళ్ల వరకే పంట విక్రయించగా, రైతుల వద్దే ఇంకా 5–6 లక్షల క్వింటాళ్లు ఉంది. ప్రపంచ పసుపు పంట సాగులో 70 శాతం వాటా ఇండియాదే. తర్వాత చైనా 8 శాతం, బంగ్లాదేశ్ 3.5, నైజీరియా 3, ఇథియోపియో 3.1, వియత్నాం 2, థాయ్‌లాండ్‌లో 2 శాతం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పెరు, తైవాన్, జమైకా, హైతి, కోస్టారికా దేశాల్లో సాగు చేస్తున్నారు. ఇక దేశంలోని తెలంగాణలో 24 శాతం, ఆంధ్రప్రదేశ్ 22, తమిళనాడు 15, ఒడిశా 13, అస్సాం 6, మహారాష్ట్ర 4, కేరళ 4, కర్ణాటక 3, సిక్కింలో 1 శాతం సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్‌లో పసుపు సాగు చేస్తున్నారు.
ఎగుమతులపై ప్రభావం
మన దేశంలో పండిన పసుపును ఎక్కువగా గల్ఫ్ దేశాలైన ఇరాన్, యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, జర్మనీ, జపాన్, బ్రిటన్, అమెరికా, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేస్తారు. ఏటా దాదాపు రూ.2,000 కోట్ల విలువ గల పంట ఎగుమతి అవుతుంటుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. భద్రత కారణాలు, రవాణా కష్టాల వల్ల పసుపు ఎగుమతిని ఎక్స్‌పోర్టర్లు నిలిపేశారు. ఎగుమతుల్లో డీలా ఏర్పడి, దేశీయంగా ధరలు తగ్గుతున్నాయి. అలాగే మార్కెట్‌లోకి కొత్త పసుపు భారీగా వస్తుండడం, యుద్ధం ప్రభావంతో వ్యాపారులు కొనుగోలు చేసిన పసుపు నిల్వలు పేరుకుపోవడం, గతేడాది నిల్వలు కూడా ఉండిపోవడం, ఏదో కారణం చెప్పి వ్యాపారులు సిండికేట్ అయి ధరలు తగ్గిస్తుండటం తదితర కారణాలతో పసుపు ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది.
గోదాంలకు తరలింపు
పసుపు పంటకు ఎలాగైనా డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది రైతులతో పాటు తక్కువ ధరకు పంట కొనుగోలు చేసిన వ్యాపారులు నిల్వ చేసేందుకు కోల్ట్ స్టోరేజీలు, గోదాంలకు తరలిస్తున్నారు. రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయనే ఆశతో కొందరు నిల్వ చేస్తుంటే, మరికొందరు రైతులు ఏదో ధరకు అమ్ముకుంటున్నారు. అయితే, యుద్ధం ఆగిపోయి ఆయా దేశాలు మళ్లీ పసుపును దిగుమతి చేసుకుంటేనే ధరల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది.
క్వింటాల్‌కు రూ.3 వేల నష్టం
మొన్నటి వరకు క్వింటాల్‌కు రూ.13 వేలు పలికిన పసుపు, ప్రస్తుతం యుద్ధ వాతావరణంతో రూ.3 వేల వరకు నష్టపోవాల్సి వస్తుంది. నిల్వ చేస్తామంటే ఎప్పుడు యుద్ధం ఆగుతుందో, రేట్లు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి.
– ఎల్క కమలాకర్, సంగెం శ్రీరాంపూర్


