మానకొండూర్: తెలుగు భాషను ప్రోత్సహించేందుకు ఓ అధ్యాపకుడు వినూత్న ఆలోచన చేశాడు. ఇంటర్‌లో తెలుగు సబ్జెక్టులో 99 మార్కులు తెచ్చుకున్న వారిని తిరుమల వెంకన్న దర్శనానికి తీసుకెళ్తానని చెప్పాడు. ఎనిమిది మంది 99 మార్కులు తెచ్చుకోగా ఇచ్చిన మాట ప్రకారం వెంకన్న దర్శనం చేయించాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన బోళ్ల ప్రవీణ్‌కుమార్ కామారెడ్డి మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. తాను బోధించే విద్యార్థులకు తెలుగు సబ్జెక్టుపై మక్కువ పెంచేలా వినూత్నంగా ఆలోచన చేశాడు. తెలుగులో 99 మార్కులు తెచ్చుకుంటే తిరుమల తీసుకెళ్తానని విద్యార్థులతో చెప్పాడు. గతేడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన 40 మందిలో 8మంది 99 మార్కులు తెచ్చుకున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో తిరుమల తీసుకెళ్లడం వీలుకాకపోవడంతో సదరు విద్యార్థులను ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన మరునాడు తిరుమల తీసుకెళ్లాడు. శనివారం వెంకన్న దర్శనానికి వెళ్లిన విద్యార్థులు మంగళవారం కామారెడ్డికి చేరుకున్నారు. వీరితో అధ్యాపకులు బాలమల్లు శ్రీకర్, రవి ఉన్నారు.


